Hyderabad : ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ. 5 లక్షలు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఇంటి నిర్మాణ అనుమతి ఇప్పించేందుకు జీహెచ్‌ఎంసీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ACB Telangana : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సామాన్యులను వేధిస్తూ, అందినకాడికి దండుకుంటున్న అధికారుల తీరుపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని బోరబండ సర్కిల్-37 కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ/ట్యాక్స్) విభాగంలో పనిచేస్తున్న బి. శ్రీలత సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

రూ. 5 లక్షలు డిమాండ్…
కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక బాధితుడు తన ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి పొందడం కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే…. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అనుమతి పత్రాలు చేతికి వచ్చేలా చూస్తానని శ్రీలత సదరు బాధితుడికి చెప్పారు. దీని కోసం రూ. 5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శ్రీలత డిమాండ్‌తో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం…. సోమవారం సాయంత్రం యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ వద్ద శ్రీలత మొదటి విడతగా రూ. 1,00,000 లంచం తీసుకుంటుండగా…. ఏసీబీ సీఆర్-1 (CR-1) బృందం ఆమెను చుట్టుముట్టింది. ఆమె వద్ద నుంచి లంచం తీసుకున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుంది.
శ్రీలత చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు…. ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడానికి ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ తెలంగాణ విభాగం కోరుతోంది. "అవినీతి రహిత సమాజం కోసం పౌరులు తమకు సహకరించాలి. ఎవరైనా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి," అని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వారు హామీ ఇచ్చారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి ఏయే మార్గాలు అందుబాటులో ఉన్నాయి?
జవాబు: మీరు టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. అలాగే ఏసీబీ తెలంగాణ ఫేస్‌బుక్ పేజీ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ప్రశ్న: ఫిర్యాదు చేసిన వారి వివరాలు బయటకు తెలుస్తాయా?
జవాబు: లేదు. ఫిర్యాదుదారుల లేదా బాధితుల వివరాలను ఏసీబీ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. కాబట్టి సామాన్యులు ధైర్యంగా ముందుకు రావచ్చు.
ప్రశ్న: ప్రభుత్వ అధికారి లంచం అడిగితే వెంటనే డబ్బులు ఇవ్వాలా?
జవాబు: లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. ఎవరైనా అధికారి డబ్బులు అడిగితే, ఆ విషయాన్ని వెంటనే ఏసీబీకి తెలియజేయండి. వారు సూచించిన విధంగా ట్రాప్ నిర్వహించి అవినీతి అధికారులను పట్టుకోవడం జరుగుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

