...
...
Next Story

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు.. వాణిజ్యంపై ఫోకస్!

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం చేస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై లారెల్ సానుకూలంగా స్పందించారు.

Published on: Sep 8, 2026, 17:04:35 IST
Advertisement

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు తెలంగాణ-ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి లారెల్‌తో ఉత్తమ్ సమావేశం
ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి లారెల్‌తో ఉత్తమ్ సమావేశం

భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా అవతరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. భారీ పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ, అవసరమైన అనుభవం తెలంగాణకు ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై లారెల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుంచి మరింత ఎక్కువ మెుత్తంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే విధానంపై చర్చించారు.

ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసుకునే బియ్యం అవసరం గణనీయంగా ఉండటం, అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల సంఖ్యను విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుండటం నేపథ్యంలో ఈ చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. పోటీ ధరలు, నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా కార్యదర్శి లారెల్ ఆసక్తి వ్యక్తం చేశారు. దీనిని స్వాగతించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు బలమైన సామర్థ్యం ఉందన్నారు. ఎగుమతికి అనువైన ఉత్పత్తులు, నాణ్యతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర నియంత్రణ నిబంధనలను సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తామని తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం వల్ల రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ఇతర వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. 'తెలంగాణ రైతులు, వ్యవసాయ పరిశ్రమలకు స్థిరమైన, లాభదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లను సృష్టించడమే మా లక్ష్యం. ఫిలిప్పీన్స్‌కు బియ్యం, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దీర్ఘకాలంపాటు విశ్వసనీయంగా సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక నైపుణ్యం తెలంగాణకు ఉన్నాయి.' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

భారత్-ఫిలిప్పీన్స్ సంబంధాలు, ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ప్రత్యక్ష వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపై కూడా ఇరువురు విస్తృతంగా చర్చించారు. భారత్-ఫిలిప్పీన్స్ మధ్య అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో వ్యవసాయం, ఆహార వాణిజ్యం కీలక పాత్ర పోషించగలవని అభిప్రాయపడ్డారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి లారెల్ తమ తమ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా పరస్పరం ఆహ్వానించుకున్నారు. 2026 డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా లారెల్‌కు ఉత్తమ్ ప్రత్యేక ఆహ్వానం అందించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe