TG Digital Health Profile : రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు - పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

ప్రజలకు సమర్థవంతంగా వైద్యసేవలు అందించేందుకు డిజిటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌ వ్యవస్థను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.

Published on: Mar 13, 2026 9:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ representative image (image source istock)
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ representative image (image source istock)

గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన, అమలు పై రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమన్వయ సన్నాహాక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుకు పైలెట్ జిల్లాగా ఎంపిక చేసిన నేపథ్యంలో…. ప్రాజెక్ట్ అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా…..

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో (జీజీహెచ్–1, ఏరియా ఆసుపత్రులు–4, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు–5, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు–4, ప్రైమరీ హెల్త్ సెంటర్లు–31, బస్తీ దవాఖానాలు–19) సేవలు ప్రారంభిస్తారు. వచ్చే ప్రతి రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయడానికి కసరత్తును ప్రారంభించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

  • రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతిదీ రికార్డ్ చేస్తారు.
  • ఓపీ, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్, ఫార్మసీ వంటి అన్ని విభాగాల్లో రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేసే విధంగా అవసరమైన ఐటీ సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు.
  • డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రోగి పూర్తి వైద్య చరిత్ర డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తారు.
  • ఫలితంగా వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి సౌలభ్యం కలుగుతుందని మంత్రి దామోదర తెలిపారు.
  • ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న ఎన్‌సీడీ, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎంసిహెచ్, చైల్డ్ హెల్త్ సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తారు. అవసరమైతే రిఫరల్ సిస్టమ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్న ఈ పైలెట్ ప్రాజెక్టును అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డు అమలు కోసం సంగారెడ్డి జిల్లాలో చేపట్టే ఈ పైలెట్ ప్రాజెక్టు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More