విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు ఈ తేదీ డెడ్‌లైన్.. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

విద్యార్థుల ఆధార్ అప్డేట్ కోసం పాఠశాల విద్యాశాఖ డెడ్‌లైన్ పెట్టింది. మరోవైపు ఆధార్ ఆపరేటర్లు క్యాంపులు నిర్వహించేందుకు వస్తే అనుమతించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Updated on: Sep 19, 2026, 08:02:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. విద్యాశాఖ తరఫున వచ్చే ఆధార్ ఆపరేటర్లను తమ ప్రాంగణాల్లో క్యాంపులు నిర్వహించేందుకు అనుమతించని పాఠశాలలు, జూనియర్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆధార్ అప్డేట్
ఆధార్ అప్డేట్

విద్యాశాఖ డిప్యుటేషన్‌పై నియమించిన ఆపరేటర్ల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల యాజమాన్యాలు UDISE+ పోర్టల్‌లోకి లాగిన్ అయి, తమ పాఠశాల/కళాశాలలో ఏ విద్యార్థులకు బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో జాబితాను సరిచూసుకోవాలి.

నిర్దేశిత వయోపరిమితి (సాధారణంగా 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయస్సు దాటిన విద్యార్థులు) పూర్తి చేసుకున్న వారు తమ వేలిముద్రలు, కంటిపాప స్క్యాన్ (Iris Scan), తాజా ఫోటోగ్రాఫ్‌ను విధిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి ఎంట్రెన్స్ టెస్టులతో పాటు వివిధ రకాల ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, విద్యా సేవలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి. బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ ప్రాంగణాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించడానికి ఆపరేటర్లను అనుమతించడం లేదని విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఈ విధమైన నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి విద్యాసంస్థలపై సంబంధిత చట్టాలు, రూల్స్ ప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులను ఆదేశించింది.

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి శరీర నిర్మాణంలో మార్పుల వల్ల వేలిముద్రలు, ఐరిస్ రూపం మారుతాయి. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనల ప్రకారం 5 ఏళ్లు, 15 ఏళ్లు నిండినప్పుడు ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం తప్పనిసరి. విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల ప్రవేశాల సమయంలో ఆధార్ డేటా సరిగ్గా ఉండటం ఎంతో ముఖ్యం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More