చర్లపల్లి-వేలాంకణి అదనపు ప్రత్యేక రైళ్లు.. ఈ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మార్పు

వేలాంకణి ఉత్సవం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. చర్లపల్లి-వేలాంకణి నడుమ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Published on: Aug 13, 2026, 11:07:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ వేలాంకణి మాత వార్షిక మహోత్సవాల నేపథ్యంలో ప్రయాణికులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని నూతన టెర్మినల్ చర్లపల్లి నుండి వేలాంకణి మధ్య అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా కేటాయించిన ఈ ప్రత్యేక రైళ్ల సమయ వేళలు, వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి – వేలాంకణి (రైలు నంబరు: 07127): ఈ ప్రత్యేక రైలు సెప్టెంబరు 08, 2026 (మంగళవారం) ఉదయం 07:40 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:10 గంటలకు వేలాంకణి చేరుకుంటుంది.

వేలాంకణి – చర్లపల్లి (రైలు నంబరు: 07128): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబరు 09, 2026 (బుధవారం) రాత్రి 11 గంటలకు వేలాంకణిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10:15 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకుంటుంది.

ఇరు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మయిలాడుతురై, నాగపట్నంలో ట్రైన్స్ ఆగుతాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని తరగతుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. వీటిలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ వేలాంకణి మాత ఉత్సవాలకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను సంప్రదించాలని రైల్వే అధికారులు సూచించారు.

రైళ్ల వేళలు మార్పు

సాంకేతిక, నిర్వహణ కారణాల వల్ల హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.

హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12728): నిర్ణీత సమయం ఆగస్టు 16, 2026 సాయంత్రం 05:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు సాయంత్రం 07:05 గంటలకు హైదరాబాద్ నుండి ఆలస్యంగా బయలుదేరుతుంది.

హైదరాబాద్ – చెన్నై బీచ్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12760): ఆగస్టు 16, 2026 సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ రైలు అదే రోజు రాత్రి 07:15 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సమయ మార్పులను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More