Indiramma Housing Scheme : హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు
Indiramma Indlu Towers Scheme : హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు రాగా…. వరుస సెలవుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Indiramma Indlu Towers Scheme : హైదరాబాద్ మహా నగర పరిధిలోని పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకం దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఆగస్టు 15వ తేదీ (శనివారం) వరకు ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించి, నామమాత్రపు ధరలకే నిరుపేదలకు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పథకం కింద మొత్తంగా లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసి, 7,340 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన వివరాలు అందించారు.
ప్రజా విజ్ఞప్తుల మేరకు గడువు పెంపు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభిస్తోందని, నిత్యం వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా రెండో శనివారం, బోనాల పండుగ వంటి వరుస సెలవులు రావడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని గడువును ఆగస్టు 15 వరకు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది.
అధికారిక షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 10, సోమవారంతో ముగియాల్సి ఉంది. జూలై 21 నుంచి మీసేవా కేంద్రాలు, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్, అలాగే మీ-సేవా వాట్సాప్ సేవల ద్వారా దరఖాస్తుల స్వీకరణ సాగుతోంది. ఆగస్టు 10 సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,121 దరఖాస్తులు నమోదయ్యాయి. గడువు పెంచిన నేపథ్యంలో సంబంధిత హౌసింగ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ నెలాఖరు నాటికే కేటాయింపులు…
దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, తదుపరి ప్రక్రియల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని మంత్రి అధికారులను గట్టిగా ఆదేశించారు. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన, అర్హతల నిర్ధారణ… కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు ప్రక్రియలను వేగవంతం చేసి, ఈ ఆగస్టు నెలాఖరు నాటికి అర్హులకు ఇళ్లను కేటాయించాలని స్పష్టమైన గడువు విధించారు.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎలాంటి గందరగోళానికి లేదా అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. నిర్దేశిత అర్హత ప్రమాణాలకు కట్టుబడి…. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, నూరు శాతం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఇళ్లను కేటాయిస్తామని పునరుద్ఘాటించారు.
నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులు:
- అంబర్‌పేట -3,073
- బహదూర్‌పుర -1,706
- ఇబ్రహీంపట్నం -1,031
- కార్వాన్ -2,184
- ఖైరతాబాద్ -5,518
- కూకట్‌పల్లి -6,615
- మహేశ్వరం -734
- మలక్‌పేట -3,609
- మల్కాజిగిరి -1,333
- మేడ్చల్ -1,668
- నాంపల్లి -4,372
- కుత్బుల్లాపూర్ -5,571
- రాజేంద్రనగర్ -2,060
- సనత్‌నగర్ -1,404
- సికింద్రాబాద్ (కంటోన్మెంట్) -1,755
- శేరిలింగంపల్లి -3,488
- మొత్తం -46,121
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

