రాబోయే 35 రోజుల్లోగా సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొంగులేటి

Sada Bainama : రుణ మాఫీలు, గిట్టుబాటు ధరల కల్పన వంటి చర్యల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

Published on: May 7, 2026, 05:27:15 IST
By , Khammam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భూ సంబంధిత సమస్యలను భూ భారతి' కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న 'సాదా బైనామా' కేసులన్నింటినీ రాబోయే 35 రోజుల్లోగా పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రజా దర్బార్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి, ఈ ప్రజా దర్బార్‌లో స్వీకరించిన వినతులను మూడు నెలల లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సాదా బైనామాపై మంత్రి పొంగులేటి
సాదా బైనామాపై మంత్రి పొంగులేటి

రుణ మాఫీలు, గిట్టుబాటు ధరల కల్పన వంటి చర్యల ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని పొంగులేటి పేర్కొన్నారు. మద్దతు ధరలకే ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని, సన్న రకాల ధాన్యానికి అదనపు బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు.

గృహ నిర్మాణ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. 'ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం' కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లను సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు సంబంధించిన తదుపరి విడత ప్రక్రియను మే నెలాఖరు నాటికి చేపడతామని ప్రకటించారు.

'రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా, పాలనను నేరుగా వారి గడప వద్దకే తీసుకువచ్చాం. ఎక్కడ ప్రజాదర్బార్ నిర్వహించిన ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లు కావాలని అడుగుతున్నారు, తప్పకుండా వచ్చే రెండు, మూడు, నాలుగు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇచ్చి తీరుతాము. పింఛన్ల అంశంపై కేబినెట్ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. భూ సమస్యలకు కూడ భూభారతితో శాశ్వత విముక్తి కలుగుతుంది.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పొంగులేటి విమర్శించారు. నాడు వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి, కానీ నేడు వరి కి మద్దతు ధర అందించడమే కాకుండా 500 బోనస్ ఇచ్చి, ఒక్క గింజ కూడ వదలకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతలను అన్నివిధాలా ఆదుకుంటుందని వెల్లడించారు.

గత రెండుసార్లు ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మి అధికారాన్ని అప్పచెబితే పేదల సంక్షేమం, రాష్ట్ర ప్రగతిని విస్మరించి లక్షల కోట్లను కొల్లగొట్టారని పొంగులేటి ఆరోపించారు. దేశంలోనే కాదు విదేశీ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకున్నారన్నారు. ఏ వ్యాపారం చేసి లక్షల కోట్లకు అధిపతి అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగారు. అంతేకాదు ఏ ప్రాంతీయ పార్టీకిలేని పార్టీ ఫండ్ మీకే ఎందుకు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More