Bonalu 2026 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు... పోటెత్తిన భక్తులు.. సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

Published on: Aug 2, 2026, 14:58:04 IST
By , Secunderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సికింద్రాబాద్‌లో బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధల నడుమ కన్నులపండువగా జరుగుతోంది. ఆదివారం ఈ వేడుకకు నగర నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉదయం వేళల్లోనే ఎండ తీవ్రత 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన క్యూ లైన్లు ఆలయ చుట్టుపక్కల రోడ్ల వెంబడి దాదాపు కిలోమీటరు మేర సాగాయి.

భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు. తెల్లవారుజామున వచ్చిన వారికి ఎలాంటి రద్దడి లేకుండా సులభంగా అమ్మవారి దర్శనం లభించింది.

అయితే, ఉదయం 8 గంటల సమయం దాటిన తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. జనసందోహం పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలోనే నిలబడి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దడిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ, క్యూ లైన్లలో తాగునీరు అందించేలా వసతులు కల్పించారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తులు తొట్టెలు, బోనాలతో తమ మొక్కులను చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని, సుభిక్షంగా ఉంటామని భక్తుల గాఢమైన నమ్మకం. ఈ పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ, పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తున్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టువస్త్రాలు, సమర్పించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీ సజ్జనార్ దంపతులతోపాటుగా పలువురు ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More