తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ఆషాఢ మాస బోనాల జాతరకు సికింద్రాబాద్ లష్కర్ సిద్ధమవుతోంది. ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆలయ ఈఓ, అర్చకులు అందజేశారు.
లష్కర్ బోనాల జాతర - 2026 పూర్తి షెడ్యూల్:

జూలై 19 (ఆదివారం): అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
ఆగస్టు 2 (ఆదివారం): ప్రధాన బోనాల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభిస్తారు.
ఆగస్టు 3 (సోమవారం): ఉదయం 8:30 గంటలకు ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఉదయం 10:30 గంటలకు అమ్మవారి గజవాహన సేవ, జోగినుల నృత్యాలతో లష్కర్ వీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు వైభవంగా సాగుతుంది.
అన్ని ఏర్పాట్లు చేస్తాం: పొన్నం
"తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ మంత్రితో కలిసి త్వరలోనే అన్ని శాఖల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఉత్సవాల విజయవంతానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది." అని మంత్రి తెలిపారు.
ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ లష్కర్ బోనాల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖలు ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి.