తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన షాబాద్ వరుస హత్యల నిందితుడు ఎట్టకేలకు శవమై కనిపించాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా…. వరుసగా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న సైకో కిల్లర్ ఎరకలి రాజ్‌కుమార్ (32) మరణించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పెంజర్ల గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఆ మృతదేహం గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరకలి రాజ్‌కుమార్‌దేనని ధృవీకరించుకున్నారు. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతని మృతదేహాం పక్కన పురుగుల మందు బాటిల్ లభ్యమైనట్లు తెలిసింది.
నిందితుడు రాజ్‌కుమార్ షాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలకు పాల్పడి నరమేథం సృష్టించిన సంగతి తెలిసిందే. మైనర్ బాలికపై ఘోర అఘాయిత్యానికి ఒడిగట్టిన ఈ సైకో కిల్లర్…. ఆ తర్వాత వరుసగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో…. అతడు అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఇటు ప్రజల్లోనూ, అటు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్‌కుమార్ ఎలా మరణించాడు? అతడు ఆత్మహత్య చేసుకున్నాడా..? వంటి కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
ఇవాళే అంత్యక్రియలు…!
రాజ్ కుమార్ మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇవాళే పోస్టుమార్టం పూర్తి చేసి… అతని కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించి అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అతని స్వగ్రామాంలో( దైవాలగూడ ) ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.