‘నా చేతులారా నేనే చేసుకున్నా’..! 6 హత్యలకు ముందే రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో - వెలుగులోకి కీలక విషయాలు..!

షాబాద్ ఆరు హత్యల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ హత్యలు చేయడానికి ఒక రోజు ముందే రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు.

Published on: Jul 13, 2026, 22:08:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ఒక రోజు ముందే ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో
రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో

నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు….. అందులోని డేటాను విశ్లేషించగా ఈ షాకింగ్ వీడియో బయటపడింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఈ మొబైల్ వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. ఈ వీడియో ఆధారంగా నిందితుడు పక్కా ప్రణాళికతోనే, తీవ్రమైన కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది.

పోలీసులు విడుదల చేసిన వీడియోలో రాజ్‌కుమార్ తన ఆవేదనను, హత్యకు గల కారణాలను వివరించాడు. ఒక అమ్మాయిని నమ్మి తాను ఎంతలా మోసపోయిందో ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు.

"నేను చాలా మోసపోయాను. నన్ను, నా కష్టాన్ని ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకొని వదిలేసింది. నన్ను నట్టేట ముంచి మోసం చేసింది. వారి కారణంగా నేను కోట్లాది రూపాయల అప్పుల పాలయ్యాను. సమాజంలో తలఎత్తుకోలేక, అప్పులు తీర్చలేక నా జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది" అని రాజ్‌కుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన రాజ్‌కుమార్…… తన పిల్లల భవిష్యత్తు నాశనమైందనే ఆక్రోశాన్ని ఆ వీడియోలో వెళ్లగక్కాడు. "చివరికి నా పిల్లలకు కూడా కనీసం ఒక సెంటు భూమి లేకుండా పోయింది. నా చేతులారా నేనే చేసుకున్నా. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను. నన్ను ఈ స్థితికి తెచ్చిన వారిని వదిలిపెట్టను. అందర్నీ చంపేసి చనిపోవాలని నిర్ణయించుకున్నాను" అని ఈ సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు.

రాజ్ కుమార్ సూసైడ్….!

ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ (32) కూడా మృతి చెందాడు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సరిహద్దుల్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అతని మృతదేహాం పక్కన పురుగుల మందు బాటిల్ లభ్యమైనట్లు తెలిసింది.

రాజ్‌కుమార్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అతని మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. రాజ్‌కుమార్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. దీంతో చేవెళ్ల శ్మశాన వాటికలోనే రాజ్‌కుమార్‌ అంత్యక్రియలకు పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More