ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో 'సిట్' ఏర్పాటు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ నేతృత్వం వహించనున్నారు.

Published on: Dec 19, 2025, 09:24:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత బీఆర్ఎస్ హయాంలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో సిట్ దర్యాప్తు పూర్తి చేసి త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేస్తామని రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసు

ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరినే సిట్‌ దర్యాప్తు అధికారిగా నియమించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని గుర్తించారు. అయితే కేసు నమోదైన 21 నెలల తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటంతో ఈ కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారినట్లు అయింది.

సిట్ లోని సభ్యులు వీరే…

సిట్ టీమ్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఇక అంబర్‌ కిషోర్‌ ఝా (రామగుండం కమిషనర్‌), ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ (సిద్దిపేట కమిషనర్‌), రితీరాజ్‌ (మాదాపూర్‌ డీసీపీ), కె.నారాయణరెడ్డి (మహేశ్వరం డీసీపీ), ఎం.రవీందర్‌రెడ్డి (గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌), కె.ఎస్‌.రావు (రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ), పి.వెంకటగిరి (జూబ్లీహిల్స్‌ ఏసీపీ), సీహెచ్‌ శ్రీధర్‌ (టీజీఏఎన్‌బీ డీఎస్పీ), నాగేందర్‌రావు (హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డీఎస్పీ) సభ్యులుగా ఉన్నారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 12న పోలీసులకు లొంగిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎస్ఐబీ మాజీ చీఫ్ రావు తన పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) నుంచి సస్పెండ్ చేయబడిన డీఎస్పీతో సహా నలుగురు పోలీసు అధికారులను మార్చి 2024 నుండి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించడంతో పాటు గత బిఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం వారికి బెయిల్ మంజూరు కావటంతో జైలు నుంచి బయటికొచ్చారు .

వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను నిఘా నీడలో ఉంచడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్ఐబి వనరులను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగానే విచారణ జరుగుతుండగా.. ఇప్పటికే చాలా విషయాలు బయటికొచ్చాయి.

ఈ కేసులో టాస్క్‌ఫోర్స్‌ విశ్రాంత డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావులు కీలకంగా ఉన్నారు. వీరిని అప్పట్లో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారించిన క్రమంలోనే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు.

ప్రభాకర్‌రావుతో పాటు… మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించారు. దీంతో వీరు అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు పోలీసులు అదుపులో ఉండగా… విచారిస్తున్నారు. అయితే ఆయన పెద్దగా సహకరించటం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More