ఫోన్ ట్యాపింగ్ కేసు : ముగిసిన కేటీఆర్ ‘సిట్’ విచారణ - 7 గంటలకుపైగా ప్రశ్నలు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకుపైగా సిట్ అధికారులు విచారించారు. మరోవైపు కేటీఆర్ విచారణ వేళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు.

Published on: Jan 23, 2026 6:38 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా… దాదాపు 7 గంటలకుపైగా విచారణ కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

కేటీఆర్
కేటీఆర్

మరోవైపు కేటీఆర్ సిట్ విచారణ జరుగుతున్నంత సేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించారు. ఓవైపు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ…. పార్టీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ పరిసరాల్లోనే ఉన్నారు.

'సిట్' విచారణపై వార్తలు - బీఆర్ఎస్ సీరియస్

ఇక సిట్ విచారణపై పలు మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. “సిట్ విచారణలో భాగంగా ఇలా జరుగుతోంది, అలా జరుగుతోంది అని కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిళ్లు పనిగట్టుకుని అబద్ధాలను ప్రసారం చేస్తున్నాయి. ఆధారాలు లేకుండా ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. నిరాధారమైన వార్తలు, వ్యక్తిత్వహననం చేసే కథనాల మీద బీఆర్ఎస్ పార్టీ లీగల్‌ చర్యలు చేపడుతుంది అని హెచ్చరిస్తున్నాం” అని స్పష్టం చేసింది.

సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌గా మారిపోయిందని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… మీడియా ఛానళ్లు అడ్డగోలుగా లీక్ వార్తలు ఆపాలని సూచించారు. అసలు లోపల జరుగుతున్న విచారణ గురించి మీడియాకు లీక్ ఎవరు ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. లోపల జరగని దాన్ని నిజం అన్నట్లు బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.