సిట్ నోటీసులు అంతా ఒక ట్రాష్.. అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం : హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణ ముగిసింది. ఏడు గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

Published on: Jan 20, 2026, 19:21:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు ఏడు గంటలపాటు హరీశ్ రావును అధికారులు ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు హరీశ్ రావు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కి బయలు దేరి వెళ్లారు.

ముగిసిన హరీశ్ రావు సిట్ విచారణ
ముగిసిన హరీశ్ రావు సిట్ విచారణ

తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నైతిక మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు.

అంతా ఒక ట్రాష్

రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా ఒక ట్రాష్ అని హరీశ్ రావు అన్నారు. నిరాధార ఆరోపణలు, అడిగిందే అడుగడం, సొల్లు పురాణం అని వ్యాఖ్యానించారు. అధికారులకు గంట అడగగానే బయటి నుంచి ఫోన్లు వస్తున్నాయని, మళ్లీ గంట తరువాత వస్తున్నారని, ఫోన్లు వస్తే ముగ్గురు బయటికి పోయి వచ్చి మళ్లీ అడుగుతున్నారన్నారు.

ఎవరు ఫోన్ చేస్తున్నారో..

అడిగిందే తప్ప కొత్తగా ఏం లేదు అని హరీశ్ రావు చెప్పారు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండో, సజ్జనర్ చేసిండో అని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రం తనకు నోటీసులు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, దైర్యం ఉంటే, తప్పు చేయకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

డైవర్ట్ చేయడానికే సిట్

'నీ బామ్మర్దే మొదటి దోషి. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. టెండర్ల విషయం డైవర్ట్ చేయడానికే ఈ సిట్. ఎన్ని సిట్‌లు అయినా వేసుకో రేవంత్ రెడ్డి. ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు మాకు కొత్త కాదు. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన సైనికులం. ఉద్యమంలో వందలాది కేసులు పెట్టిన కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడినం. కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయే వాల్లం కాదు. ఈ అక్రమ కేసులు నాకు కొత్త కాదు.' అని హరీశ్ రావు అన్నారు.

కోర్టులు కొట్టివేశాయి

మీరిచ్చే నోటీసులు తన ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగానే భావిస్తానని హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఒక ప్రైవేటు కేసులో కోట్లు ఖర్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడారు. సుప్రీం కోర్టు, హైకోర్టు కొట్టి వేసిందన్నారు. ఇప్పుడు సిట్ పేరిట విచారణ జరుపుతున్నారన్నారు.

పోరాడుతూనే ఉంటా

ఘోష్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ అంతా డొల్ల అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించానని హరీశ్ రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి స్కామ్‌లకు తెగబడ్డారన్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా హరీశ్ రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన ఇంకా గట్టిగా పోరాడుతూనే ఉంటామన్నారు.

ఏ విచారణకైనా వస్తా

'మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.. రేపు ప్రజా కోర్టులో సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు రేవంత్. నాకు చట్టంపై గౌరవం ఉంది కానీ, నీ చిల్లర రాజకీయాలపై అసహ్యం ఉంది. న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా నేను ఏ విచారణకైనా వస్తాను. కుంభకోణాలు కుండబద్దలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంట. లీకులు ఇవ్వడం కాదు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టు. సింగరేణిలో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మల్లా డిమాండ్ చేస్తున్నాం.' అని హరీశ్ రావు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More