హరీశ్ రావుపై కుట్ర.. జైలుకు పంపించాలని చూస్తున్నారు : కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు సిట్ విచారణపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర ఉందని, అలాగే అందరికీ అంటించాలని చూస్తున్నారని విమర్శించారు.

Published on: Jan 20, 2026, 16:55:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు సిట్ విచారణపై తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్ రావు హాజరయ్యారన్నారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నాడన్నారు.

కేటీఆర్
కేటీఆర్

ప్రశ్నిస్తూనే ఉంటాం

అడ్డగోలు సిట్ విచారణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం అందలం ఎక్కిచ్చిన బుద్ధి మాత్రం బురదలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.

హరీశ్ రావుపై కుట్ర

'ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్ రెడ్డి?అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. గతంలో హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కానీ కేవలం హరీశ్ రావుపై కుట్రతో జైలుకు పంపించాలన్న దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో ప్రజల డబ్బులు పెట్టి మరీ ప్రభుత్వం వాదించింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందువల్లనే సాయంత్రం వరకూ హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీశ్ రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదు?.' అని కేటీఆర్ ప్రశ్నించారు.

డైవర్షన్ పాలిటిక్స్

కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేశారన్నారు. ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారని తెలిపారు. సింగరేణిని ఒక బంగారు బాతు లాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకువచ్చారన్నారు.

సీఎం బావమరిది బెదిరిస్తున్నారు

టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలి అన్న నిబంధన దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టారని కేటీఆర్ అన్నారు. సింగరేణి అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలని, సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగారని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నాడన్నారు.

సర్టిఫికెట్ కోసం ఎవరైనా బెదిరింపులకు లొంగకుండా ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ అర్హులైన కంపెనీలకు ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపణలు చేశారు. భట్టి విక్రమార్క రద్దు చేశామని చెప్తున్నా నాయని కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా నడుస్తోందన్నారు. ఇతర కంపెనీలను అందరినీ బెదిరించి ఎక్కువ అంచనా విలువకు టెండర్లు వేస్తున్నారన్నారు. అందుకే సృజన్ రెడ్డి కంపెనీకి కూడా అధిక విలువకు టెండర్లు దక్కించుకున్నారని తెలిపారు.

ప్రధాన ముద్దాయి సృజన్ రెడ్డి

'ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్ రెడ్డి. ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్రం-రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా కిషన్ రెడ్డి ఉన్నారు? కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయి అని అనుకోవాలి. వెంటనే ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ వేయాలి అని డిమాండ్ చేస్తున్నాం.' అని కేటీఆర్ అన్నారు.

హరీశ్ రావుకు ఏం కాదు

గతంలో కూడా ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమృత్ టెండర్ల స్కాం, రేషన్ బియ్యం స్కాం, లగచర్ల, మూసి అంశాలను తెరపైకి తీసుకొచ్చినప్పుడు, సాక్ష్యాధారాలు చూపించినప్పుడు ఇదే అటెన్షన్ డైవర్షన్ చేసిందన్నారు కేటీఆర్. అసెంబ్లీలోనే 8 మంది మంత్రులను ఎదుర్కొన్న హరీష్ రావును నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది? అని అడిగారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More