కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ.. టీడీపీ పాట ఎందుకు పాడుతున్నారు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడటం వెనక ఉన్న అసలు కుట్ర అర్థమవుతోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం గానే కాదు.. హోంమంత్రిగా కూడా ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటారా అని కేటీఆర్ మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

లా అండ్ ఆర్డర్ నిర్వహణలో పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు రాజ్యమేలడం తెలంగాణకు పట్టిన దరిద్రమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండెలనిండా గులాబీజెండాపై చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయినట్టు స్పష్టమవుతోందన్నారు. రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న మీకు పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని విమర్శించారు.
'సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసు శాఖ, డీజీపీ, ఇవాళ ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి ఇవాళ అర్థమైపోయింది. రెండేళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టంచేసేలా జలహక్కులను కాలరాశారని ఇవాళ చేసిన ప్రకటనతో మీ నిజస్వరూపం బట్టబయలైంది.' అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజువవుతోందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను నాలుగు కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందన్నారు.
రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర : హరీశ్ రావు
అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందన్నారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని ఆరోపించారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన 'ఓటుకు నోటు' దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
'ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి వుండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి?' అని హరీశ్ రావు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


