సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చేరిపేసే ప్రయత్నాలు మానుకోవాలి - కేటీఆర్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం శాంతి ర్యాలీ మాత్రమే కాకుండా… ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Published on: Jan 17, 2026, 14:59:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ నెలకొంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ‘సికింద్రాబాద్ బచావో’ పేరుతో శాంతి ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇందుకు అనుమతి లేదంటూ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులను అడ్డుకున్నారు.

మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయన్నారు.ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయని చెప్పారు. తుగ్లక్ పాలన అంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. హామీల అమలును పక్కన పెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టాడని దుయ్యబట్టారు.

“మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు. ఆ తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసివేశారు. వీటన్నిటి వలన ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. ప్రజల దగ్గరికి పాలన పోవాలన…, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాదులోనూ వార్డులను, జోన్లను పెంచడం జరిగింది” అని కేటీఆర్ వివరించారు.

చారిత్రక గుర్తింపు పోయేలా ఉంది - కేటీఆర్

హైదరాబాద్–సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్‌కు చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై… ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు.

“ప్రజలంతా సంఘటితమై… మా పార్టీని ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వారే. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలి అని… సికింద్రాబాద్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చెరిపివేయడం కోసం కాదు” అని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

“హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఒక ఇల్లు కూడా కట్టలేదు. కానీ నగరం మొత్తం తన విధ్వంస ప్రణాళికలతోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు. కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి… ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని, కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను, సాధారణ ప్రజలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం జరిగింది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

“రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే మా హక్కును కచ్చితంగా ఉపయోగించుకుంటూ మరోసారి కోర్టుకు వెళ్లి శాంతి ర్యాలీని నిర్వహించుకుంటాం. కేవలం శాంతి ర్యాలీ మాత్రమే కాకుండా, అనేక ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటాం. మరోసారి తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సికింద్రాబాద్‌ను మరో జిల్లాగా మారుస్తాం” అని కేటీఆర్ ప్రకటన చేశారు.

“10 సంవత్సరాల తర్వాత ఉన్న జిల్లాలను తీసివేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. చిన్న జిల్లాలతో ప్రజల దగ్గర అధికారులు వస్తే రేవంత్ రెడ్డికి ఉన్న నొప్పి ఏమిటో అర్థం కావడం లేదు. రాష్ట్ర సచివాలయం కంటే గొప్పగా కట్టుకున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు పాలన అందుతుంటే రేవంత్ రెడ్డికి ఏం సమస్య ఉందో అర్థం కావడం లేదు” అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.

ర్యాలీ నిర్వహించి తీరుతాం - మాజీ మంత్రి తలసాని

మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ… పోలీసులు మొదటగా శాంతి ర్యాలీకి అనుమతి ఇచ్చారని చెప్పారు. “లష్కర్ సాధన సమితి ర్యాలీకి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు.. వేలాది మందిని అరెస్ట్ చేశారు. నల్లజెండాలు, కండువాలతో సికింద్రాబాద్ బచావో పేరుతో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాం. మా ప్రాంతం పేరు లేకుండా, మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మాకు సికింద్రాబాద్‌తో ఉన్నది మట్టి సంబంధం. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు.. కోర్టు ద్వారా ర్యాలీ నిర్వహిస్తాం” అని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More