గోల్డ్ లోన్స్‌లో సౌత్ ఇండియానే టాప్.. తెలంగాణ, ఏపీలోనూ భారీగా రుణాలు!
సామాన్యుడికి డబ్బు అవసరం వస్తే మెుదటగా గుర్తుకు వచ్చేది గోల్డ్ లోన్. అయితే ఈ గోల్డ్ లోన్స్‌లో దక్షిణ భారతదేశం టాప్‌లో ఉంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా కూడా ఎక్కువే.
అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఠక్కున గుర్తుకువచ్చేది గోల్డ్ లోన్. బంగారం రుణాలలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. మిగతా రుణాలతో పోల్చుకుంటే గోల్డ్ లోన్ రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువగా పత్రాలు అవసరం ఉండవు. డబ్బులు కూడా వెంటనే పడిపోతాయి. దీంతో బంగారం రుణాలకు జనాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రుణాల్లో తెలంగాణ, ఏపీ వాటా కూడా ఎక్కువే ఉందని నివేదికలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం బంగారు రుణాలు రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు మార్కెట్‌లో 76.55 శాతం వాటా కలిగి ఉన్నాయి. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ బంగారు రుణ మార్కెట్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి
రూ.14.5 లక్షల కోట్లలో టాప్ 10 రాష్ట్రాలు కలిపి రూ.13.2 లక్షల కోట్ల గోల్డ్ లోన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే బంగారం రుణాలు తీసుకున్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలంలో 3.63 కోట్ల మంది వినియోగదారులు రూ.6 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను పొందారు. ఇది గత సంవత్సరం కంటే రుణ విలువలో 53 శాతం వృద్ధిని, కస్టమర్ బేస్‌లో 16 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ఒక్కో కస్టమర్‌కు సగటు రుణం 2023 సెప్టెంబర్‌లో రూ.1.1 లక్షల నుండి 2025 సంవత్సరం రూ.1.64 లక్షలకు పెరిగింది. రూ.1 లక్ష కంటే తక్కువ రుణ ఖాతాలు గణనీయంగా తగ్గాయి. రూ.1 లక్ష కంటే తక్కువ రుణాల వాటా రెండేళ్లలో 25.9 శాతం నుండి 14.4శాతానికి తగ్గింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. బంగారం ధరలు పెరగడం వల్ల తాకట్టు పెట్టిన లోహంపై మంజూరు చేసిన మొత్తాలు పెరగడం కూడా ప్రధాన కారణంగా ఉంది.
తమిళనాడు: 4.9 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్: 3.4, కర్ణాటక: 1.4 లక్షల కోట్ల రుణాలతో టాప్ 3లో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ ఉన్నాయి. డేటా ప్రకారం రుణగ్రహీతలు బంగారు రుణాలను ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రక్రియ వేగంగా ఉంటుంది. కనీస డాక్యుమెంటేషన్, సౌకర్యవంతమైన షరతులను అందిస్తుంది. ఇటీవలి నెలల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో రుణగ్రహీతలు గ్రాముకు పొందే మొత్తం కూడా పెరిగింది.














