జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు.. వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు!

జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగానే వర్షాలు పడనున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.

Published on: Jun 2, 2026, 16:35:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భానుడు సృష్టిస్తున్న భీభత్సానికి త్వరలోనే బ్రేక్ పడనుంది. గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది.

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు

రుతుపవనాల రాకతో పాటు రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉంది. ఇవి గురువారం నాటికి కేరళలో ప్రవేశిస్తే, అక్కడ నుంచి వారం రోజులలోపు, అంటే జూన్ రెండో వారంలోగా ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కంటే ముందే రాష్ర్టంలో ముందస్తు వర్షాలు ఊపందుకోనున్నాయి. దీనివల్ల రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వేడి గాలుల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడనుంది.

రాబోయే బుధ, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బుధవారం నాడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వర్షాలు పడనున్నాయి. మరోవైపు మధ్య, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు.

వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున పాత ఇళ్లు, తాత్కాలిక షెడ్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల దగ్గర ఉండకూడదు.

ఖరీఫ్ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఈ ముందస్తు వర్షాల ఆధారంగా భూమిని సిద్ధం చేసుకోవచ్చు. అయితే కోసి ఆరబోసిన పంటలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

హైదరాబాద్ నగరంలో కూడా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More