...
...
Next Story

PV Birth Anniversary : పీవీ....ఆర్థిక సంస్కరణల సారథి - దేశ ప్రగతికి మార్గదర్శి!

PV Narasimha Rao Birth Anniversary : దేశ రాజకీయాల్లో తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు పాత్ర వెలకట్టలేనిది. క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దేశ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేశారు. ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు నేడు దేశానికి ఫలాలుగా మారాయి.

Published on: Jun 28, 2026, 11:07:49 IST
Advertisement

రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు తమ పదవుల వల్ల చిరస్థాయిగా నిలుస్తారు. మరికొందరు తమ నిర్ణయాలతో దేశ భవిష్యత్తును మార్చిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఇలాంటి అరుదైన మహానుభావుల్లో మన పి.వి. నరసింహారావు అగ్రగణ్యులు. నాడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను ఆధునిక భారత చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. రాజకీయవేత్తగానే కాకుండా ఆర్థిక సంస్కరణల సారథిగా, దౌత్యవేత్తగా, బహుభాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా ఆయన వ్యక్తిత్వం అనేక కోణాలతో వెలుగొందింది.

పి వి నరసింహారావు (ఫైల్ ఫొటో)
పి వి నరసింహారావు (ఫైల్ ఫొటో)

తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న జన్మించిన పి.వి. నరసింహారావు విద్యాభ్యాసాన్ని ఉస్మానియా, నాగ్‌పూర్, ముంబై విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేశారు. తెలుగు, సంస్కృతం, హిందీ, మరాఠీ, ఉర్దూ, తమిళం, కన్నడ, ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచ్, స్పానిష్ వంటి పదిహేడు భాషల్లో ప్రావీణ్యం సంపాదించి “బహుభాషా కోవిదుడు”గా ఆయన కీర్తి పొందారు. జ్ఞానమే శక్తి అనే నమ్మకంతో జీవితాంతం అధ్యయనాన్ని కొనసాగించిన అరుదైన రాజకీయ నాయకుడు ఆయన.

ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం…

1957లో మంథని నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పి.వి.నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక శాఖలకు మంత్రిగా, అనంతరం 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను కఠినంగా అమలు చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థపై కీలకమైన దెబ్బ కొట్టారు. భూమి లేని పేదలకు భూమి అందించాలనే లక్ష్యంతో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, తన కుటుంబానికి చెందిన 500 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వానికి అప్పగించి ఆదర్శంగా నిలిచారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి, తెలంగాణ ప్రాంత హక్కుల పరిరక్షణకు ఆయన చూపిన నిబద్ధత విశేషమైనది.

ప్రత్యేక పరిస్థితుల్లో 1991లో పి.వి. నరసింహారావు భారత ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 1989 నుంచి దేశ రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాలు వరుసగా కూలిపోవడంతో కేంద్రంలో పాలనా స్థిరత్వం పూర్తిగా దెబ్బతింది.

ఈ పరిణామాల మధ్య 1991 మే 21న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో దేశం తీవ్ర రాజకీయ శూన్యతలోకి వెళ్లింది. నాడు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం, దేశం అనిశ్చిత పరిస్థితుల్లో చిక్కుకోవడం భారత ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారింది. అప్పటికే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుని విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్న పి.వి. నరసింహారావునే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకోవడం భారత రాజకీయ చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచింది.

నాడు రాజకీయ సంక్షోభమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దివాలా అంచున నిలిచింది. 1991 జూన్ నాటికి భారత విదేశీ మారక నిల్వలు కేవలం 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే మిగిలి…. అవి దేశానికి అవసరమైన దిగుమతులకు రెండు వారాలకంటే తక్కువ కాలానికే సరిపడే స్థాయికి పడిపోయాయి. ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 8.4 శాతానికి చేరుకోగా, ద్రవ్యోల్బణం 13 శాతానికి పైగా నమోదైంది. విదేశీ రుణభారం 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

విదేశీ మారక ద్రవ్యాన్ని సమీకరించేందుకు భారత ప్రభుత్వం 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ తరుణంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన పి.వి. నరసింహారావు అసాధారణ ధైర్యం, దూరదృష్టితో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదం నుండి బయటపడింది.

దేశ ఆర్థిక పునర్నిర్మాణానికి సరైన నాయకత్వం అవసరమని భావించిన పి.వి. నాడు ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. 1991 నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి “లైసెన్స్ రాజ”కు ముగింపు పలికారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ద్వారా పరిశ్రమలకు స్వేచ్ఛ కల్పించడం, ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించారు.

నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడానికి ఈ సంస్కరణలే బలమైన పునాదిగా నిలిచాయి. బ్యాంకింగ్, మూలధన మార్కెట్లలోనూ పి.వి.నరసింహారావు ప్రభుత్వం దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంది. నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు బ్యాంకింగ్ రంగ సంస్కరణలు చేపట్టడం, కొత్త ప్రైవేట్ బ్యాంకులకు అవకాశాలు కల్పించడం, సెబీకి చట్టబద్ధ అధికారాలు ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, పోటీతత్వాన్ని పెంచారు. ఈ సంస్కరణల ఫలితంగానే భారత బ్యాంకింగ్ రంగం ప్రపంచ ప్రమాణాలకు చేరువైంది.

ఆధునిక సాంకేతిక రంగాన్ని దేశ ప్రజలకు చేరువ చేయాలని భావించిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం డిజిటల్ భారత్‌కు గట్టి పునాది వేసింది. 1994 జాతీయ టెలికాం విధానం ద్వారా టెలికాం రంగంలో ప్రయివేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించడంతో మొబైల్ కమ్యూనికేషన్ విస్తరణకు మార్గం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల విస్తరణ, సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రోత్సాహం, కంప్యూటర్ దిగుమతులపై సడలింపులు భారత ఐటీ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశాయి.

నేడు హైదరాబాద్, బెంగళూరు, పుణే, గురుగ్రామ్ వంటి నగరాలు ప్రపంచ ఐటీ పటంలో నిలవడానికి ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణాలుగా భావిస్తారు. దౌత్యరంగంలోనూ ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాల ఏర్పాటు, “లుక్ ఈస్ట్‌” విధానం ద్వారా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాల విస్తరణ, ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత విదేశాంగ విధానాన్ని మలచడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. భారత అణు కార్యక్రమం, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అందించిన రాజకీయ మద్దతు కూడా అత్యంత కీలకమైనది.

రాజకీయ నాయకుడే కాకుండా ఆయన గొప్ప సాహితీవేత్త కూడా. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ నవలను హిందీలో ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించారు. పి.వి. నరసింహారావు తన రాజకీయ అనుభవాల ఆధారంగా రచించిన ‘ది ఇన్‌సైడర్‌’ నవల భారత రాజకీయాల అంతరంగాన్ని ఆవిష్కరించిన విశిష్ట రచనగా గుర్తింపు పొందింది.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు ఆదర్శంగా నిలిచిన పి.వి.నరసింహారావు దేశానికి చేసిన అసాధారణ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2024లో అత్యున్నత పురస్కారమైన ’భారతరత్న’తో గౌరవించింది. తెలుగు వెలుగు పి.వి. చరిత్ర, రాజకీయ చాణక్యం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. ఆర్థికంగా సంక్షోభ స్థితిలో ఉన్న భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చే మార్గంలో నడిపించిన సంస్కరణల సారథిగా, ఆధునిక భారత నిర్మాణ శిల్పిగా, యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతగా పాములపర్తి వెంకట నరసింహారావు పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

- వ్యాసకర్త, -ఐ.వి.మురళీ కృష్ణ శర్మ. జర్నలిస్ట్

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ. జర్నలిస్ట్
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe