మార్గదర్శి కేసులో ఉండవల్లి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై దాఖలైన క్రిమినల్ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 ఆగస్టు 4న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు పేర్కొంది.

సుప్రీంకోర్టు విచారణ వివరాలు
విచారణ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లోకస్ స్టాండీ (పిటిషన్ దాఖలు చేసే అర్హత)పై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు గుప్పించిందని మార్గదర్శి సంస్థ తెలిపింది. వాదనల సరళిని పరిశీలిస్తే ఇది వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించినట్లు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లు వివరించింది.
మార్గదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డిపాజిటర్లకు ఇప్పటికే రూ. 2,591 కోట్లకు పైగా సొమ్మును చెల్లించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఎవరైనా డిపాజిటర్లు వస్తే చెల్లించేందుకు వీలుగా మరో రూ. 5.23 కోట్లను ఎస్క్రో (Escrow) ఖాతాలో సురక్షితంగా భద్రపరిచినట్లు వెల్లడించారు.
కేసు నేపథ్యం - హైకోర్టు తీర్పు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2008లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ (HUF)గా ఉంటూ డిపాజిట్లు సేకరించి ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదైంది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఉండవల్లి అప్పీల్ చేయడంతో 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. డిపాజిటర్ల నుంచి విజ్ఞప్తులు, అభ్యంతరాలను ఆహ్వానించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
డిపాజిటర్ల నోటీసులు - కేసు ముగింపు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ 2024 సెప్టెంబర్ 26న పత్రికల్లో బహిరంగ ప్రకటన విడుదల చేసింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో ఎవరూ ఫిర్యాదులతో ముందుకు రాలేదు. మరోవైపు మార్గదర్శి మాజీ కర్త రామోజీరావు 2024 జూన్‌లో స్వర్గస్తులైనందున, హెచ్‌యూఎఫ్‌లోని ఇతర సభ్యులపై క్రిమినల్ చర్యలు కొనసాగించలేమని తెలంగాణ హైకోర్టు కేసును కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఈ లీగల్ పోరాటానికి ముగింపు పడిందని మార్గదర్శి ఫైనాన్షియర్స్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ జి. సాంబశివరావు ప్రకటనలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


