పదవీ విరమణ తర్వాత పెన్షన్ స్కీమ్ మార్పు కుదరదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన తర్వాత తమ పెన్షన్ స్కీమ్‌ను మార్చుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD) మాజీ ప్రొఫెసర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.

Published on: Aug 21, 2026, 08:45:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పదవీ విరమణ పొంది, రిటైర్మెంట్ ప్రయోజనాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ విధానాన్ని (Pension Scheme) మార్చుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సర్వీసులో ఉన్నంత కాలం ఒక స్కీమ్ కింద కొనసాగి, రిటైర్ అయిన తర్వాత వేరే స్కీమ్ వర్తింపజేయాలని కోరడం చెల్లదని స్పష్టం చేసింది.

భారత సర్వోన్నత న్యాయస్థానం
భారత సర్వోన్నత న్యాయస్థానం

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (NIRD)లో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన చంద్ర అనే వ్యక్తి కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సెంట్రల్ పెన్షన్ ఫండ్ (CPF) కింద ప్రయోజనాలు తీసుకున్న ఆయన, తనకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వర్తింపజేయాలని కోరుతూ న్యాయ పోరాటానికి దిగారు.

ఉద్యోగ ప్రస్థానం, అసలు వివాదం

పిటిషనర్ చంద్ర 1984 నవంబర్ 12న ఎన్ఐఆర్‌డిలో కాంట్రాక్ట్ పద్ధతిన రీసెర్చ్ అసోసియేట్‌గా చేరారు. మరుసటి రోజే ఆయనను సీపీఎఫ్ స్కీమ్ పరిధిలోకి తెస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 1985 నవంబర్ 7న ఆయన సర్వీసును క్రమబద్ధీకరించారు (Regularised). ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007 మే 1న కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్‌గా నియమితులైన ఆయన సర్వీసును 2012 మే 4న ప్రొఫెసర్‌గా రెగ్యులరైజ్ చేశారు. అయితే ఈ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వస్తాయని, ఆయన సీపీఎఫ్ స్కీమ్ కిందనే కొనసాగుతారని అందులో స్పష్టం చేశారు.

2017 జనవరి 31న పదవీ విరమణ చేసిన చంద్ర, అదే ఏడాది ఫిబ్రవరి 14న తన రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకున్నారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది. ఎన్ఐఆర్‌డి నిబంధనల ప్రకారం తనకు సీపీఎఫ్ కాకుండా జీపీఎఫ్ స్కీమ్ వర్తింపజేయాలని ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు.

ట్రిబ్యునల్ తీర్పు, హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈ కేసును విచారించిన క్యాట్ 2019 జూలై 15న పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. చంద్రతో పాటే రెగ్యులరైజ్ అయిన ఆయన సహోద్యోగి ఎస్.ఎస్.పి శర్మ కేసును ఉదహరిస్తూ, చంద్రకు కూడా అర్హత సాధించిన తేదీ నుంచి జీపీఎఫ్ వర్తింపజేయాలని ఎన్ఐఆర్‌డిని ఆదేశించింది. కానీ, అప్పటికే శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2012 మే 4న ఇచ్చిన రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఆ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని, ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి కాదని 2023 ఫిబ్రవరి 28న అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో క్యాట్ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్ఐఆర్‌డి హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన తర్వాత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు తుది తీర్పు

హైకోర్టు తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. "ఎస్.ఎస్.పి శర్మ కేసులో ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుత పిటిషనర్‌కు కూడా వర్తిస్తుంది" అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట పెన్షన్ స్కీమ్ కింద ప్రయోజనాలు తీసుకున్న తర్వాత, ఆ షరతులను సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చిచెబుతూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More