గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
రూ. 30 వేలు లంచం తీసుకుంటూ…

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. ఫిర్యాదుదారుడితో పాటు అతని సహచరులపైన టేక్మాల్ రక్షక భట నిలయంలో ఓ కేసు నమోదైంది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు జారీ చేసినందుకు (ఈ కేసు లోక్ అదాలత్‌లో పరిష్కరించబడింది) ఫిర్యాదుదారుడి నుండి రూ.30,000 లంచం డిమాండ్ చేశాడు.దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు… ఎస్సై రాజేశ్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఛేజింగ్ చేయటంతో…
ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌కు రావడాన్ని గమనించిన ఎస్సై రాజేష్, వారి నుంచి తప్పించుకోవడానికి స్టేషన్ నుంచి పరుగులు తీశారు. ఏసీబీ సిబ్బంది వెంటాడి ఛేజింగ్ చేసి, చివరికి ఓ వరి పొలంలో ఎస్సై రాజేష్‌ను పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడటంతో ఆగ్రహించిన స్థానికులు…. గ్రామస్తులు టేక్మాల్ పోలీస్ స్టేషన్ ముందు బాణాసంచాలు పేలుస్తూ ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ పరిణామం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.