Telangana BC Castes : తిట్టు పదాల పేరుతో ఉన్న పేర్లు తొలగింపు - బీసీ కులాల జాబితాలో మార్పులు, సర్కార్ ఆమోదం

Telangana BC caste name changes : తెలంగాణలోని పలు బీసీ కులాల జాబితాలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు కులాల పేర్ల మార్పు, పర్యాయపదాల చేర్పుపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ వివరాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం తాజాగా వెల్లడించారు.

Published on: May 08, 2026 9:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana BC caste name changes : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభ్యర్థనలు, వారి సామాజిక గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు రాష్ట్ర కేబినెట్ పలు కులాల పేర్లలో మార్పులు చేసేందుకు, అలాగే మరికొన్ని కులాలకు పర్యాయపదాలను జోడించేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా గ్రూప్-ఏ, గ్రూప్-డి విభాగాల్లోని పలు వరుస సంఖ్యల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

బీసీ కులాల జాబితాలో మార్పులు
బీసీ కులాల జాబితాలో మార్పులు

సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన సుదీర్ఘ కాలపు విన్నపాలను పరిశీలించిన అనంతరం…. వారి మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు బీసీ జాబితాలో చేసిన మార్పుల వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

గ్రూప్-ఏ విభాగంలో మార్పులు:

  • గడ వంశీయ: గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటివరకు ఉన్న "దొమ్మర" అనే పదాన్ని తొలగించి….. దాని స్థానంలో "గడ వంశీయ" అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.
  • వంశ రాజ్: గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 18లో ఉన్న "పిచ్చకుంట్ల" అనే పదాన్ని మార్చారు. ఇకపై దీన్ని "వంశ రాజ్" గా వ్యవహరిస్తారు.
  • బుడబుక్కల (శివ క్షత్రియ): వరుస సంఖ్య 4లో ఉన్న కులానికి "శివ క్షత్రియ" అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చారు. దీంతో ఈ కులం పేరు ఇకపై "బుడబుక్కల, శివ క్షత్రియ"గా రికార్డుల్లో నమోదు కానుంది.
  • రజక, చాకలి, ధోబీ: వరుస సంఖ్య 5లో ఉన్న "వన్నార్" అనే పదాన్ని తొలగించారు. ఆ స్థానంలో "ధోబీ" అనే పదాన్ని చేర్చి, మొత్తంగా "రజక, చాకలి, ధోబీ"గా పేర్కొంటారు.
  • వీరభద్రియ: వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియ కులానికి సంబంధించి, వారి అభ్యర్థన మేరకు "వీరముష్టి, నెట్టి కోటల" అనే పదాలను పర్యాయపదాలుగా కలిపారు.

గ్రూప్-డి విభాగంలో మార్పులు :

  • తమ్మలి (బ్రాహ్మణేతర): గ్రూప్-డి లోని వరుస సంఖ్య 29లో ఉన్న "శూద్ర కులం" అనే పదాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో "తమ్మలి (బ్రాహ్మణేతర)"గా పేరు మార్చారు.
  • మేర, మేరు, చిప్పోలు: వరుస సంఖ్య 5లో ఉన్న కులానికి "మేరు" అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చారు. దీనివల్ల ఇకపై "మేర, మేరు, చిప్పోలు" అనే పేర్లతో ఈ వర్గాన్ని గుర్తిస్తారు.

ఈ మార్పుల వల్ల ఆయా కులాలకు చెందిన ప్రజలు విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా పొందే అవకాశం ఉంటుందని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయంతో ఈ కొత్త పేర్లు వెంటనే అధికారిక రికార్డుల్లో అమల్లోకి రానున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More