రాబోయే ఎన్నికలపై ఎలా ముందుకెళ్దాం..? వ్యూహ రచనలో బీజేపీ...!

మున్సిపల్ తో పాటు పరిషత్ ఎన్నికల వేళ పార్టీ బలోపేతంపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల వేళ పార్టీ బలోపేతం కోసం పార్టీలోని ఎంపీలందరూ సమిష్టిగా కృష్టి చేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

Published on: Dec 19, 2025, 11:53:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ… ఆ తర్వాత జరుగుతున్న పలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ మూడో స్థానానికే పరిమితమైంది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలకే పరిమితమైంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం… కసరత్తు షురూ చేసింది.

బీజేపీ తెలంగాణ
బీజేపీ తెలంగాణ

ఢిల్లీలో ఎంపీల భేటీ…

గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో పార్టీ ఎంపీలు సమావేశమైయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మార్గదర్శకత్వంలో తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల అంశం చర్చకు వచ్చాయి. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రత్యేక వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు తీర్మానించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అరవింద్ ధర్మపురి, ఎం రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

గతం వారం దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ఎంపీల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారనే వార్తలు బయటికొచ్చాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనే విషయంలో బలంగా ముందుకెళ్లలేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలిసింది.

2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో ఎనిమిది సీట్లను గెలుచుకున్నప్పటికీ… ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి డిపాజిట్ కోల్పోవడం, 2024 లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓటమి వంటి అంశాల నేపథ్యంలో మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పలువురు బీజేపీ ఎంపీలు కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే సమాచారం లీక్ అవ్వటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.

ఎంపీలతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే… రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతం కోసం చర్యలు చేపట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశం కూడా ఇందులో భాగంగానే జరిగిందని తెలుస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More