అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ.. మెట్రో టేకోవర్‌పై కీలక అప్డేట్ వచ్చే అవకాశం!
Telangana Cabinet Meeting October 1st : అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మెట్రో టేకోవర్ అంశం ప్రధాన ఎజెండాగా ఉండనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 1న అత్యవసరంగా భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా పంపిణీ చేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ పథకంతో పాటు ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే నిధుల సమీకరణ ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 11 నుండి 18 వరకు జరగనుంది. ఈ పండుగ పురస్కరించుకుని రాష్ట్రంలోని సుమారు కోటి మంది నిరుపేద మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఏడాది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజైన నవంబర్ 19న ఈ చీరల పంపిణీని చేపట్టారు. అయితే ఈ ఏడాది బతుకమ్మ పండుగ ముందే వస్తుండటంతో, పండుగ కానుకగా ముందుగానే అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చీరల పంపిణీకి సంబంధించి నిబంధనలు, నాణ్యత, రోడ్‌మ్యాప్‌ను అక్టోబర్ 1 కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు.
మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను ఎల్&టీ కంపెనీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల సమీకరణ ప్రక్రియ కొలిక్కి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ నగర ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఎల్ అండ్ టీకి ఈక్విటీ కొనుగోలు కింద ప్రభుత్వం సుమారు రూ.14,600 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఉన్న రూ.13,600 కోట్ల అప్పును ప్రభుత్వం రీఫైనాన్సింగ్ ద్వారా తనపై వేసుకునేందుకు అంగీకరించింది. నిధుల సమీకరణ బాధ్యతలను ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ చూస్తోంది. ఆరంభంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్‌కు నిధులు ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, రుణ నిబంధనలు, ఫండింగ్ స్ట్రక్చర్‌పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది.
తొలి ఒప్పందం ప్రకారం ఈ టేకోవర్ ప్రక్రియ జూన్ నెలాఖరుకే పూర్తి కావాల్సి ఉంది. అయితే రీఫైనాన్సింగ్ ఆలస్యం కావడంతో గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు సెప్టెంబర్ 30 నాటికి నిధుల ఒప్పందం పూర్తి కాకపోవడంతో, ఒప్పంద గడువును డిసెంబర్ 31 వరకు (మరో 3 నెలలు) పొడిగించాల్సిందిగా ఎల్ అండ్ టీని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ వేగవంతం కావాలంటే ఫేజ్-1 టేకోవర్ వ్యవహారం త్వరగా తేలడం ఎంతో కీలకంగా మారింది. ఈ సమస్యల పరిష్కారానికి కేబినెట్ భేటీలో ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


