వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలి : ఏఐసీసీ ఇన్ఛార్జి బీఎం సందీప్ కుమార్

గాంధీభవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్న ఈ భేటీలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Published on: Nov 22, 2026, 15:45:54 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(PAC) కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన తదుపరి వ్యూహాలపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పీఏసీ సభ్యులనుద్దేశించి నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, ప్రభుత్వ పాలన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.

'గత అసెంబ్లీ ఎన్నికల్లో మనమంతా ఐకమత్యంతో పనిచేయడం వల్లే 64 స్థానాల్లో ఘనవిజయం సాధించాం. ఆ తర్వాత జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ మనమే జయకేతనం ఎగురవేశాం. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో, అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి.' అని సందీప్ కుమార్ పిలుపునిచ్చారు.

దేశంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తోందని సందీప్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సహాయ సహకారాలు అందించడంలో వివక్ష చూపుతున్నప్పటికీ, ప్రజల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని కొనియాడారు.

దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని ఇన్‌ఛార్జ్ సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన బలిదానాలు, సోనియా గాంధీ త్యాగాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల సోనియా గాంధీ రచించిన 'బిలాంగింగ్' (Belonging) పుస్తకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ, ప్రాధాన్యత లభిస్తోందని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.