Telangana SSC Exams 2027 : తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి!

Telangana SSC Exams 2027 : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వచ్చే మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ తయారుచేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Published on: Nov 22, 2026, 10:12:01 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2027వ సంవత్సరానికి సంబంధించిన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(SSC) పరీక్షల టైమ్‌టేబుల్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపింది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు మార్చి 17 లేదా 18న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్‌సీ పరీక్షలు ఒక నెల రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 10వ తేదీతో పరీక్షలు ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు. మెుత్తం 24 రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల మధ్య గ్యాప్ ఉంటుంది.

పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షలు

ఇక పరీక్షా రుసుమును అక్టోబర్ 30 నుండి నవంబర్ 16 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించాలి. నిర్ణీత గడువులోగా రుసుము చెల్లించలేని విద్యార్థులు ఆలస్య రుసుమును చెల్లించి పొడిగించిన గడువు తేదీలలో ఫీజు పే చేయవచ్చు.

అక్టోబర్ 30 నుండి నవంబర్ 16 వరకు: ఆలస్య రుసుము లేదు

నవంబర్ 18 నుండి డిసెంబర్ 1 వరకు: రూ. 50 ఆలస్య రుసుము

డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 14 వరకు: రూ. 200 ఆలస్య రుసుము

డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 28 వరకు: రూ. 500 ఆలస్య రుసుము

విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నిర్ణీత తేదీలలోపు రుసుమును చెల్లించాలి. పరీక్షా రుసుము, విద్యార్థి రాసే సబ్జెక్టుల సంఖ్యను బట్టి మారుతుంది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా అన్ని సబ్జెక్టులకు: రూ. 125, మూడు సబ్జెక్టుల వరకు: రూ. 110, వొకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, సాధారణ ఎస్ఎస్‌సీ పరీక్షా రుసుము రూ. 125తో పాటు అదనంగా రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.

మీ సేవలో టెన్త్ సర్టిఫికేట్ తప్పుల సవరణ

పదో తరగతి ఒరిజినల్ మెమోలలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లితే, వాటిని సరిచేయించుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇకపై ఉండదు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ సర్టిఫికెట్ల సవరణ ప్రక్రియ మొత్తాన్ని ఇక మీదట మీసేవ(MeeSeva) పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణ ప్రతిపాదనల సమర్పణ, పరిశీలన ప్రక్రియ మొత్తం ఇకపై మీసేవ పోర్టల్ ద్వారానే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఎవరూ కూడా విద్యార్థుల నుండి నేరుగా సవరణ దరఖాస్తులను స్వీకరించవద్దని, విద్యాశాఖకు పంపవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

గతంలో టెన్త్ మార్కుల మెమోలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ మార్చుకోవాలంటే విద్యార్థులు బ్యాంక్ చలాన్ ద్వారా ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఫైళ్లు కదలడంలో తీవ్ర జాప్యం జరిగేది. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి కొత్త మెమో జారీ అయ్యే వరకు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, డిజిటల్ పద్ధతిలో 6 దశల్లో సాగుతుంది.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.