Hala mobility : ‘భద్రతకే అధిక ప్రాధాన్యత’- తెలంగాణ గిగ్ వర్కర్ రూల్స్‌పై హాలా మొబిలిటీ సీఈఓ కీలక వ్యాఖ్యలు!
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'గిగ్ వర్కర్స్ రూల్స్ 2026'పై హాలా మొబిలిటీ సీఈఓ శ్రీకాంత్ రెడ్డి కలకొండ హర్షం వ్యక్తం చేశారు. 6 లక్షల మంది కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించే ఈ పథకం అమలే అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసిన గిగ్ వర్కర్ల సంక్షేమ నిబంధనలపై హాలా మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్ రెడ్డి కలకొండ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కార్మికుల జీవితాల్లో పెను మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయి అమలుపై కీలక సూచనలు చేశారు.

కర్ణాటక, రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల సరసన చేరుతూ తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ ప్లాట్‌ఫామ్-బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) రూల్స్, 2026'ను ఖరారు చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మందికి పైగా గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు చట్టబద్ధమైన సామాజిక భద్రత, సంక్షేమ పరిధిలోకి వస్తారు. డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్, బైక్-ట్యాక్సీ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది, ఈ-కామర్స్ కార్మికులు, హోమ్-సర్వీస్ ప్రొవైడర్లకు ఈ నిబంధనలు రక్షణ కవచంలా నిలుస్తాయి.
"ఆర్థిక వ్యవస్థకు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సామాజిక భద్రత, సంక్షేమ విధానం ఎంతో కీలకమైన అడుగు. లాస్ట్-మైల్ డెలివరీ, మొబిలిటీ, లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో చాలామందికి గిగ్ వర్క్ ప్రధాన జీవనాధారంగా మారింది. అయితే కేవలం పని అవకాశం కల్పించడం మాత్రమే సరిపోదు; వారి జీవనోపాధిని దెబ్బతీసే అనిశ్చితుల నుంచి కార్మికులకు ఆర్థిక భద్రత, రక్షణ కూడా అవసరం," అని శ్రీకాంత్ రెడ్డి కలకొండ పేర్కొన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ వేలాది మంది డెలివరీ రైడర్లకు ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తున్న హాలా మొబిలిటీ సంస్థ.. గిగ్ కార్మికుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తోంది.
అమలు తీరే అసలైన గీటురాయి.. 'కవచ్', 'స్వయం' అనుభవాలివే!
"జీవిత బీమా, ఆరోగ్య కవరేజీతో పాటు ప్రత్యేక సంక్షేమ బోర్డు, కార్మికుల నమోదు వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ఈ రంగానికి ఒక క్రమబద్ధమైన మద్దతు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం అంతే ముఖ్యం. కార్మికులు సులభంగా పేర్లు నమోదు చేసుకునేలా, తమకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను అర్థం చేసుకుని క్లిష్టమైన ప్రక్రియలు లేకుండా సాయం పొందేలా చూడాలి. సకాలంలో ప్రయోజనాల పంపిణీ, పారదర్శక విరాళాల విధానం, అందుబాటులో ఉండే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్మికుల్లో నమ్మకాన్ని నిర్మించడానికి ఎంతో అవసరం," అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.
తమ సంస్థ అనుభవాలను పంచుకుంటూ గిగ్ కార్మికుల సంక్షేమం కోసం తాము చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. "హాలా మొబిలిటీలో గిగ్, డెలివరీ కార్మికులతో మా అనుబంధం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కార్మికుల సంక్షేమం అనేది కేవలం వాహనాలు, జీవనోపాధి అవకాశాలు కల్పించడంతోనే ఆగిపోకూడదు. మా ‘సీడ్’ చొరవ ద్వారా రోజుకు రూ. 2 ఖర్చుతో ప్రమాద, ఆరోగ్య కవరేజీ అందించే ‘కవచ్’, జీతం రోజు కంటే ముందే అర్హులైన కార్మికులు తమ సంపాదనలో కొంత భాగాన్ని తీసుకునేందుకు వీలు కల్పించే 'స్వయం' వంటి పథకాలతో వారి అవసరాలను తీరుస్తున్నాం. ప్రభుత్వ చొరవలు ఒక బలమైన పునాది వేస్తే, గిగ్ వర్కర్లతో కలిసి పనిచేసే కంపెనీలు ఆచరణాత్మక మద్దతు అందించగలవు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, ప్లాట్‌ఫామ్‌లు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య మరింత సహకారం ఉంటేనే, కార్మికులకు ఆర్థిక భద్రత, గౌరవం, స్థిరత్వం అందించే గిగ్ ఎకానమీని నిర్మించగలం," అని శ్రీకాంత్ రెడ్డి కలకొండ అభిప్రాయపడ్డారు.
6 లక్షల మందికి చట్టబద్ధ రక్షణ.. రూ. 10 లక్షల ప్రమాద బీమా!
రాష్ట్రంలోని గిగ్ వర్కర్లలో చాలా మందికి ఎలాంటి ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం గానీ, కంపెనీలతో బేరసారాలు ఆడే శక్తి గానీ లేకుండా పోయింది. పారదర్శకత లేని చెల్లింపుల వ్యవస్థ, ప్లాట్‌ఫామ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల నుంచి కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. కొత్త నిబంధనల కింద నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రమాద మరణ పరిహారంగా రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 30,000, శాశ్వత పూర్తి అంగవైకల్యానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.
అన్ని ప్లాట్‌ఫామ్‌లకు ఒకే 'యూనిక్ ఐడీ'.. ఏకపక్ష తొలగింపులకు చెక్!
ఈ నిబంధనల్లో అత్యంత కీలకమైన అంశం ‘యూనిక్ ఐడీ’! నమోదైన ప్రతి గిగ్ కార్మికుడికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. కార్మికుడు ఒక డెలివరీ లేదా క్యాబ్ ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు మారినా ఈ యూనిక్ ఐడీ చెల్లుబాటు అవుతుంది. దీనివల్ల ఏ కంపెనీలో పనిచేస్తున్నా కార్మికుడు తన గుర్తింపును కోల్పోకుండా సంక్షేమ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందే వీలుంటుంది.
ప్లాట్‌ఫామ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా కార్మికులను పనిలో నుంచి తొలగించడం, శిక్షాత్మక చర్యలు తీసుకోవడాన్ని నియంత్రించేందుకు కఠిన నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏదైనా కార్మికుడిని తొలగించాలంటే కంపెనీలు తప్పనిసరిగా లిఖితపూర్వక కారణాలు చూపాలి. నిష్పక్షపాత విచారణ జరిపి, ఏడు రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి. సరైన విధానం పాటించకుండా కార్మికులను బ్లాక్‌లిస్ట్ చేయడం గానీ, వారి రేటింగ్స్, చెల్లింపులను తగ్గించడం గానీ చేయడానికి వీల్లేదు.
10 రోజుల్లోగా ఖాతాల్లోకి వేతనం.. మహిళా కార్మికులకు భద్రత!
వేతన చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. ప్రతి పేఅవుట్ సైకిల్ ముగిసిన 10 రోజుల్లోగా ప్లాట్‌ఫామ్ కంపెనీలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులను బదిలీ చేయాలి. దీనికి తోడు కార్మికుల సంపాదన, మినహాయింపుల వివరాలను తెలిపే డిజిటల్ స్టేట్మెంట్లు విధిగా ఇవ్వాలి.
భద్రతా చర్యల్లో భాగంగా కంపెనీలు కార్మికులకు పానిక్ బటన్లు, ప్రమాద బీమా, భద్రతా హెల్ప్లైన్లు, తగిన భద్రతా శిక్షణను ఏర్పాటు చేయాలి. మహిళా గిగ్ కార్మికులకు సంబంధించి లైంగిక వేధింపుల ఫిర్యాదులు వస్తే, 'పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం-2013' నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ చట్టబద్ధ రక్షణకు ప్రైవేట్ సంస్థల తోడ్పాటు కూడా తోడైతే గిగ్ కార్మికుల భవిష్యత్తు మరింత సురక్షితంగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


