Gig Workers Rally Hyderabad : గిగ్ వర్కర్స్‌కు అండగా ఉంటాం.... మీ సమస్యలు తీరుస్తాం - రాహుల్ గాంధీ

హైదరాబాద్‌ నగరంలో గిగ్‌ వర్కర్లు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్స్ పాలసీని ప్రారంభించారు.

Published on: Nov 14, 2026, 12:15:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్ లో గిగ్ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు సహా ఇతర గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని శిల్పారామం ప్రభుత్వ ఆడిటోరియం నుంచి మాదాపూర్ జయభేరి మైదానం వరకు ఈ బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా ఒక గిగ్ వర్కర్ బైక్ వెనుక సీటుపై కూర్చుని ప్రయాణించడం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీలో ఆయన వెంట నడిచారు.

గిగ్ వర్కర్ల ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్
గిగ్ వర్కర్ల ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్

ప్రతి పైసా లెక్క తెలిసేలా చట్టం - రాహుల్ గాంధీ

బైక్ ర్యాలీ అనంతరం జయభేరి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించారు. "ఆన్‌లైన్‌లో అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌ల డేటా అందుబాటులో ఉంది. కానీ, అహర్నిశలు కష్టపడే గిగ్ వర్కర్ల డేటా మాత్రం ఇప్పటివరకు ఎక్కడా లేదు. మీకు ఎంత జీతం వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ సరైన లెక్క తెలియదు. ఇకపై మీరు సంపాదించే ప్రతి పైసా లెక్క మీకు స్పష్టంగా తెలుస్తుంది" అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.

ఎండ, వానల్లో తిరుగుతూ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ కష్టాలను ఆయన ప్రస్తావించారు. "గిగ్ వర్కర్లు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు నగరంలో సరైన షెల్టర్ కూడా లేదు. మీ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే వైఫై సదుపాయంతో కూడిన ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. గిగ్ వర్కర్ల కష్టనష్టాలను నేను స్వయంగా తెలుసుకున్నాను. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం," అని ఆయన స్పష్టం చేశారు.

"ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా తీవ్రంగా నష్టపోతారు. ప్రతీ గిగ్ వర్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం రూ.10 లక్షల ఆరోగ్య బీమా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.. గిగ్ వర్కర్ల కోసం ఇచ్చిన హామీలను పూర్తి చేశాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని కట్టుబానిసలుగా చూస్తోంది" అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.

12 హామీలతో సంక్షేమ విధానం - సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వివరించారు. "గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో కూడిన ప్రత్యేక సంక్షేమ విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రభుత్వం తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) అందిస్తాం," అని సీఎం ప్రకటించారు.

అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన చట్టం కాదని, క్షేత్రస్థాయిలో కార్మికుల అభిప్రాయాలు తీసుకుని దీనిని తయారు చేశామని ఆయన తెలిపారు. "తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లను అన్ని విధాలా ఆదుకుంటుంది. రాహుల్ గాంధీ ఒకసారి మాట ఇస్తే.. మట్టిలో కలిసినా ఆ మాట తప్పరు," అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

గతంలో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల సమస్యలను, వారికి సామాజిక భద్రత లేకపోవడాన్ని బలంగా ప్రస్తావించారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో 'తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ) బిల్లు, 2026'ను అసెంబ్లీలో ఆమోదించి చట్టంగా తెచ్చింది. ఇప్పుడు ఆ చట్టం కింద అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More