ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే ఉన్నాయి.. మోదీకి రాహుల్ బహిరంగ సవాల్

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశద్రోహి ఎవరో తేల్చుకునేందుకు ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన మొబైల్ ఫోన్‌లోనే అన్ని ఆధారాలు ఉన్నాయని రాహుల్ పేర్కొనగా, విపక్షాల తీరుపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

Published on: Nov 13, 2026, 15:17:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై తన విమర్శల దాడిని మరింత పెంచారు. తనతో ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలన్న సవాల్‌ను పునరుద్ఘాటిస్తూ.. తనను ఎదుర్కొన్న తర్వాత ప్రధాని పదవిలో కొనసాగలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన పలు వీడియో క్లిప్‌లలో రాహుల్ గాంధీ ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే ఉన్నాయి.. మోదీకి రాహుల్ బహిరంగ సవాల్
ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే ఉన్నాయి.. మోదీకి రాహుల్ బహిరంగ సవాల్

"నేను పదేపదే చెబుతున్నా.. రాసిపెట్టుకోండి, ప్రధాని నాతో చర్చకు వస్తే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ విషయం ఆయనకు తెలుసు, నాకూ తెలుసు. నన్ను పదేపదే దేశద్రోహి అని పిలుస్తున్నారు. అసలు దేశద్రోహి ఎవరో, ఎవరు ఎవరి నియంత్రణలో ఎప్పటి నుంచి ఉన్నారో దేశ ప్రజలకు చూపించాలనుకుంటున్నా. ఆ నిజం ఆయనకు కూడా తెలుసు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇరుపక్షాలు సుదీర్ఘ ప్రసంగాలు చేసే తరహా చర్చ తనకు వద్దని ఆయన స్పష్టం చేశారు.

'నా ఫోన్‌లోనే ఆధారాలు ఉన్నాయి'

తన ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, మరో వీడియో క్లిప్‌లో రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్‌ను చూపిస్తూ సమాధానమిచ్చారు. "ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఫోన్‌లోనే అన్నీ ఉన్నాయి. నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు కాబట్టి ప్రధానికి ఈ విషయం తెలుసు. ముఖాముఖి చర్చ మొదలైన క్షణమే విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారు, ఎవరు దేశద్రోహి, ఎప్పటి నుంచి దేశద్రోహిగా ఉన్నారనే విషయాలతోపాటు నాకు తెలిసిన, నా ఫోన్‌లో ఉన్న మరెన్నో వివరాలు అందరికీ తెలుస్తాయి" అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని విమర్శ

పార్లమెంటులో మాట్లాడకుండా బహిరంగ చర్చకు ఎందుకు పట్టుబడుతున్నారని ఇన్‌స్టాగ్రామ్ 'ఆస్క్ మీ' సెషన్‌లో అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే బహిరంగ చర్చను డిమాండ్ చేయాల్సి వస్తోందని ఆయన చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. "వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్, చైనా, జనరల్ నరవణే పుస్తకం, ఎప్‌స్టీన్ అంశాలపై నన్ను పార్లమెంటులో మాట్లాడనివ్వలేదు. నాకు సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన చర్చ వద్దు.. ముఖాముఖి చర్చ కావాలి" అని రాహుల్ గాంధీ బదులిచ్చారు.

'దిమాగీ నక్సల్స్'

కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొద్దిరోజులుగా సాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో శుక్రవారం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బస్తర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నక్సలిజంపై సాగించిన పోరాటంలో దేశం విజయం సాధించిందని, కానీ 'దిమాగీ నక్సల్స్' రాజకీయ పార్టీలు, సంస్థల్లోకి చొరబడ్డారని విమర్శించారు.

అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం రాహుల్ గాంధీ పార్లమెంటు చర్చల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అక్టోబర్ 30న జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. "రాహుల్ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరుగుతారు కానీ.. ఆ రాజ్యాంగాన్ని గానీ, తాను నిర్వహిస్తున్న పదవిని గానీ ఏమాత్రం గౌరవించరు" అని విమర్శించారు.

వివాదానికి నేపథ్యమిదే..

ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు చేపడుతున్న ప్రచార ఉద్దేశాలను అధికార బీజేపీ ప్రశ్నించింది. ఆ తర్వాతే ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. అంతకుముందు కూడా 'విదేశీ సాయం'తోనే మోదీ ప్రధాని అయ్యారని, పదవిలో కొనసాగుతున్నారని, భారత ఆర్థిక వ్యవస్థకు 'విదేశీ శక్తుల' మద్దతు ఉందని రాహుల్ ఆరోపణలు చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More