విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు!

తెలంగాణలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలను రెడీ చేస్తోంది.

Published on: Nov 11, 2026, 14:16:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర వ్యాపార ప్రకటనలు, రాజకీయ సంబంధిత కార్యక్రమాలపై సంపూర్ణ నిషేధం విధించాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇటీవలి కాలంలో విద్యాసంస్థల్లో అనుమతి లేకుండా నిర్వహించిన పలు కార్యక్రమాలు, ప్రమాదాలు, భద్రతా లోపాలు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

కళాశాల ప్రాంగణాల్లో చట్టబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు? దేనిపై నిషేధం విధించాలి? అనే అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రత, చదువుకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన నియమావళిని రూపొందించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇటీవల కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ల కోసం తరగతులను రద్దు చేసి, ఏకంగా సెలవు ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాకుండా విద్యార్థులు ఆయా సినిమాలను తప్పనిసరిగా చూడాలని సిఫార్సు చేయడం, కొన్ని ప్రైవేటు సంస్థలు తమ స్వార్థం కోసం విద్యార్థులను రాజకీయ లేదా ఇతర ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ తరహా ధోరణులపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రాంగణాలను వ్యాపార ప్రచార వేదికలుగా మార్చడంపై మండిపడుతున్నారు.

కేవలం చదువుకు విఘాతం కలగడమే కాకుండా, ఈవెంట్ల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయిన ఘటనలో ఒక విద్యార్థి దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటువంటి విషాదకర సంఘటనల నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావడానికి నిశ్చయించుకుంది.

ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన నిబంధనల ప్రకారం, విద్యాసంస్థలు భారీ ఎత్తున అకడమిక్, క్రీడా లేదా సాంస్కృతిక ఈవెంట్లను నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి కానున్నాయి. ఈవెంట్ నిర్వహణకు ముందే స్థానిక విద్యాశాఖ అధికారులకు, పోలీసులకు పూర్తి వివరాలు సమర్పించాలి. కార్యక్రమంలో పాల్గొనే అంచనా విద్యార్థుల సంఖ్య, స్టేజ్ నిర్మాణం నాణ్యత, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, జనసమీకరణ, ఫైర్ సేఫ్టీపై చర్యలపై ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

విద్యార్థుల్లోని నైపుణ్యాలు, క్రీడలు, కళాత్మక తాపత్రయాన్ని ప్రోత్సహించే చిన్న తరహా ఈవెంట్లకు.. అకడమిక్ సమయాన్ని వృథా చేసే భారీ వ్యాపార సమావేశాలకు మధ్య స్పష్టమైన తేడాను చూపిస్తూ నిబంధనలు సవరించనున్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. కళలు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే విద్యాసంస్థల పేరుతో నిర్దిష్ట సినిమాలను ప్రచారం చేయడం, అందుకోసం తరగతులు రద్దు చేసి సెలవులు ఇవ్వడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More