Telangana : 34 ఏళ్ల అజ్ఞాత జీవితం....జనజీవన స్రవంతిలోకి నక్కా సుశీలా! పోలీసుల ఎదుట లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ మాడ్ డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీలారాణి నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 34 ఏళ్లుగా సాయుధ పోరాటంలో ఉన్న ఆమె… మారుతున్న పరిస్థితులు, పోలీసుల ఒత్తిడి నేపథ్యంలో జనజీవన స్రవంతిలో చేరారు.
దీర్ఘకాలంగా నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో పనిచేస్తున్న సీనియర్ మహిళా నేత నక్కా సుశీలారాణి తన 34 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెరదించుతూ పోలీసుల ఎదుట లోంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా (డీసీఎం) సేవలందిస్తున్న ఆమె…. మంగళవారం నిజామాబాద్ జిల్లా పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో చేరారు. ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అధికారికంగా వెల్లడించింది.

మూడు దశాబ్ధాల ప్రస్థానం…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సుశీలారాణి అలియాస్ లత ఉన్నత విద్యావంతురాలు. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత బీఈడీ కోర్సులో చేరారు. అయితే బీఈడీ పూర్తి చేయకుండానే విప్లవ భావాల వైపు ఆకర్షితురాలయ్యారు. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే, అప్పటికే అజ్ఞాతంలో పనిచేస్తున్న సుంకర రామ్మోహన్ రావును 1990లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ 1992 ఫిబ్రవరిలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు.
అజ్ఞాతంలో ఉన్న సమయంలో 2001లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె మొదటి భర్త రామ్మోహన్ రావు మరణించారు. అనంతరం మార్చి 2004లో సమాళ వెంకటేశ్వర్లు అనే మరో విప్లవ నాయకుడిని ఆమె వివాహమాడారు. అయితే దురదృష్టవశాత్తు వెంకటేశ్వర్లు కూడా 2006లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస తీవ్ర ఆఘాతాలు ఎదురైనప్పటికీ ఆమె ఉద్యమ బాట వీడలేదు.
మావోయిస్టు పార్టీలో తన మూడు పదుల సుదీర్ఘ ప్రయాణంలో సుశీలారాణి విభిన్న బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతానికి కేడర్ బదిలీపై వెళ్లారు. 2014లో ఆమెను మాడ్ డివిజన్ కమిటీకి పంపించగా, అక్కడ ఆమె సుదీర్ఘ కాలం సేవలందించారు. ఈ సమయంలో మాడ్, ఉత్తర బస్తర్, గడ్చిరోలి, తూర్పు బస్తర్ డివిజన్ కమిటీల కేడర్‌కు రాజకీయ పాఠాలు బోధించడంలో క్రియాశీల పాత్ర పోషించారు.
అయితే భద్రతా దళాల గాలింపు చర్యలు తీవ్రతరం కావడంతో, ఆరోగ్య కారణాలు, ఇతర వ్యూహాత్మక పరిస్థితుల దృష్ట్యా ఆమెను పట్టణ ప్రాంతానికి తరలించారు. 2001 నుంచి 2024 వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన అనేక సాయుధ ఎదురుకాల్పుల సంఘటనల్లో సుశీలారాణి ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ప్రభుత్వ పునరావాస పథకాలపై పెరుగుతున్న నమ్మకం, భద్రతా బలగాల నిరంతర నిఘా, ఒత్తిడి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 266 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుశీలారాణి వంటి అత్యున్నత స్థాయి డీసీఎం నేత లొంగుబాటు మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ అని…. ప్రస్తుతం ఆ సంస్థ తెలంగాణలో ఉనికిని కోల్పోయి విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన కేవలం ముగ్గురు అగ్రనేతలు మాత్రమే మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సీపీఐ మావోయిస్టు మాజీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు జడే రత్నాబాయి, టీకే ఎస్‌జెడ్‌సీఎం సభ్యుడు వర్త శేఖర్ మాత్రమే తెలంగాణ బయట వివిధ కమిటీల్లో పనిచేస్తున్నారని పోలీసు ప్రకటన స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

