గోవా టూ హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు - వెలుగులోకి కీలక విషయాలు

గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న కస్టోడియో ఫెర్నాండెజ్‌ను ఈగిల్ ఫోర్స్, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా గోవాలో అరెస్ట్ చేశారు. రూ.48.4 లక్షల అనుమానాస్పద లావాదేవీలు, 25 మందికి పైగా కొనుగోలుదారులను గుర్తించారు.

Published on: Oct 12, 2026, 07:08:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల సరఫరా నెట్‌వర్క్‌పై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. 'ఈగిల్ (EAGLE) ఫోర్స్', హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గోవా-హైదరాబాద్‌ డ్రగ్స్‌ సరఫరా.. నిందితుడి అరెస్టు
గోవా-హైదరాబాద్‌ డ్రగ్స్‌ సరఫరా.. నిందితుడి అరెస్టు

పంజాగుట్ట కేసుతో వెలుగులోకి….

ఈ ఏడాది మే నెలలో పంజాగుట్ట పోలీసులు కేషవ్ రాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను నగరంలో ముగ్గురు వ్యక్తులకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి కారు డాష్‌బోర్డ్ పరిశీలించగా 13 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 7 గ్రాముల చరస్ లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు అతడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసు విచారణలో కేషవ్ రాజ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారంలో తాను గోవా వెళ్లి క్రిస్టీ నుంచి రూ. 40,000 విలువైన ఎండీఎంఏ, చరస్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వాటిని హైదరాబాద్‌లో రూ. 80,000కు విక్రయించి రెట్టింపు లాభం పొందాలని పథకం వేసినట్లు అంగీకరించాడు.

కేషవ్ సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. కీలక విషయాలను సేకరించారు. క్రిస్టీకి చెందిన బ్యాంకు ఖాతాల ఆర్థిక విశ్లేషణ నిర్వహించగా….. సుమారు రూ. 48.4 లక్షల జమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. క్రిస్టీకి చెందిన అనుచరులు నేరుగా గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, ఇక్కడి వినియోగదారులకు డ్రగ్స్ డెలివరీ చేసేవారు. ఆపై నగదు వసూలు చేసి క్రిస్టీకి చెందిన ఖాతాల్లో డిపాజిట్ చేసేవారని విచారణలో తేలింది. ఈ లావాదేవీల మూలాలు, లబ్ధిదారులు, వారి మధ్య ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అరెస్ట్ అయిన క్రిస్టీ మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన అధికారులకు పలు కీలక ఆధారాలు లభించాయి. తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తులు ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా క్రిస్టీ నెట్‌వర్క్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్లు, కాంటాక్ట్ వివరాలు లభించాయి. ఈ డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కొనుగోలుదారులు, పెడ్లర్లు, ఆర్థిక మధ్యవర్తులను గుర్తించి పట్టుకునేందుకు విచారణను మరింత వేగవంతం చేసినట్లు ఈగిల్ ఫోర్స్ వెల్లడించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More