పోలవరం - నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్ట్ : కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు - అడ్డుకోవాలని లేఖ

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం - నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ అడ్డుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్… కేంద్రానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును వెంటనే అడ్డుకోవాలని కోరారు.

Published on: Dec 14, 2025 12:44 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం - నలమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేగంగా కసరత్తు చేసే పనిలో ఉంటోంది. అయితే అంతే వేగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అడ్డుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ సర్కార్ ముందుగా ప్రతిపాదించిన బనకచర్ల పేరు మార్చి…ఈ కొత్త లింకింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చూస్తోందని ఆరోపిస్తోంది.ప్రస్తుతానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​) ఇంకా పరిశీలన దశలోనే ఉందని…. ఏపీ సర్కార్ చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు అనుతులు ఇవ్వకుండా చూడాలని కోరుతోంది.

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)

తాజాగా ఇదే అంశంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాశారు. పోలవరం - నల్లమల్ల సాగర్ లింకింగ్ ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఈ ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ముందుకెళ్లకుండా చూడాలని కోరారు. సీడబ్ల్యూసీతో పాటు ఇతర కేంద్ర సంస్థలను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.

పేరు మార్చి ప్రయత్నాలు….

ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టునే పోలవరం-నల్లమల సాగర్‌గా పేరు మార్చి డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలిచిందని మంత్రి ఉత్తమ్ తన లేఖలో ప్రస్తావించారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు ప్రణాళికపై తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు రావాలంటే కృష్ణా ట్రైబ్యునల్‌-2 త్వరగా అవార్డును ఖరారు చేయాలని…. అందుకోసం విచారణను వేగవంతం చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ప్రతిపాదించిన బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు తెలిపిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్రానికి సంబంధిత ఆధారాలను కూడా ఇచ్చామన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలూ కూడా అభ్యంతరం తెలిపాయన్నారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం సంబంధిత డీపీఆర్ లను కూడా రద్దు చేసుకుందని చెప్పారు. అయినా కూడా ఏపీ ప్రభుత్వం…. బనకచర్ల పేరు మార్చి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిందన్నారు. పోలవరం - నల్లమల్ల పేరుతో డీపీఆర్ తయారీకి టెండర్లను పిలిచిందని వివరించారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​) ఇంకా పరిశీలన దశలోనే ఉందని… కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టకుండా చూడాలని కోరారు.

అనుమతులు ఇవ్వండి - మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులపై పెండింగ్​లో ఉన్న సమస్యలను కూడా మంత్రి ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు, సమ్మక్క సాగర్​ క్లియరెన్ వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. కర్నాటక ఆల్మట్టి డ్యామ్​ ఎత్తు పెంచకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలన్నారు.

సుప్రీంలో న్యాయపోరాటం:

పోలవరం - నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ను అడ్డుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయనుంది.

ఇటీవలనే పోలవరం - నలమల సాగర్ డీపీఆర్ రూపకల్పన కోసం ఏపీ సర్కార్ టెండర్లను పిలిచింది. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లిం​కింగ్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని చూస్తోంది.