ఇందిరమ్మ బీమా స్కీమ్ అప్డేట్ : ఇంటింటి సర్వే ద్వారా అర్హుల ఎంపిక - ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లు..!

Indiramma Bheema Scheme Telangana : రాష్ట్రంలో 99 రోజుల ప్రజా ప్రణాళిక విజయవంతమైన నేపథ్యంలో, జూన్ 2 నుండి 12 వరకు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా’ కోసం ఇంటింటి సర్వే చేపట్టి…. ప్రత్యేక లోగో స్టిక్కర్లు అతికించనున్నారు.

Published on: May 27, 2026, 09:15:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" ముగింపు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

‘ఇందిరమ్మ బీమా’ - ప్రత్యేక లోగో స్టిక్కర్లు
‘ఇందిరమ్మ బీమా’ - ప్రత్యేక లోగో స్టిక్కర్లు

సచివాలయంలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామ సభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కేబినెట్ సబ్ కమిటీ కూలంకషంగా సమీక్షించింది. రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

జూన్ 2 నుంచి 12 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా పర్యావరణ వారోత్సవం, రోడ్డు భద్రతపై అవగాహన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, మహిళా-శిశు రక్షణ, గృహ నిర్మాణం, పర్యాటక రంగ ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

వీటితో పాటు పునర్వినియోగ శక్తి (గ్రీన్ ఎనర్జీ) ప్రాజెక్టుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా ఈ 12 రోజుల్లోనే చేపట్టాలని మంత్రుల కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు.

‘ఇందిరమ్మ బీమా’ .. ప్రత్యేక లోగో స్టిక్కర్లు

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా' పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు.

  • సమగ్ర గృహ సర్వే : రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా సమగ్ర గృహ స్థాయి డేటా సేకరణ (ఇంటింటి సర్వే) ఉంటుంది.
  • ప్రత్యేక శిబిరాలు : ఒకవేళ సర్వేలో ఎవరైనా అర్హులు మిగిలిపోతే, వారి కోసం ప్రత్యేకంగా స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి పథకంలో చేర్చుతారు.
  • అవగాహన : ఈ పథకం వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • లోగో స్టిక్కర్లు : ఈ బీమా పథకానికి ఒక ప్రత్యేకమైన 'లోగో'ను రూపకల్పన చేస్తున్నారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ఈ లోగోతో కూడిన స్టిక్కర్లను తప్పనిసరిగా అతికిస్తారు.

ఈ మెగా డ్రైవ్‌కు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు తమ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను (Action Plan) వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అధికారులను ఆదేశించారు.

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ ఇందిరమ్మ బీమా పథకాన్ని అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం…. తెలంగాణవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా…. ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.

ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం క్లెయిమ్ చేసుకునే నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల ఆధారంగా ఈ స్కీమ్ పట్టాలెక్కనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ స్కీమ్ ను ప్రారంభిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More