...
...
Next Story

TG Cheyutha Pensions : చేయూత పెన్షన్లపై కీలక అప్డేట్ - ఇకపై చేతికి నగదు బంద్..! రాబోయే కొత్త మార్పులివే

TG Cheyutha Pensions : చేయూత పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులకు నగదు ఇవ్వకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది.

Published on: Jun 4, 2026, 13:44:58 IST
Advertisement

TG Cheyutha Pensions : ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై లబ్ధిదారులకు నగదు రూపంలో ఇచ్చే చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఇటీవలనే ఆదేశించారు. ఫలితంగా ఇకపై ప్రతినెలా లబ్ధిదారుల చేతికి నగదు ఇచ్చే పాత పద్ధతికి తెరపడనుంది.

చేయూత పెన్షన్లు
చేయూత పెన్షన్లు

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా వివిధ వర్గాలకు చెందిన సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది లబ్ధిదారులకు ఇప్పటికే బ్యాంక్ ఖాతాల ద్వారానే నిధులు నేరుగా అందుతున్నాయి. అయితే…. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, కొందరు దివ్యాంగులకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ప్రతి నెల వీళ్లకి నగదు రూపంలో పింఛన్ డబ్బులను అందిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు ప్రతినెలా తపాలా (పోస్టల్) ఖాతాల ద్వారా తమ సొమ్మును డ్రా చేసుకుంటున్నారు.

అవకతవకలకు చెక్…!

ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేసే విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి క్షేత్రస్థాయి నుంచి వరుసగా ఫిర్యాదులు అందాయి. కొందరు అధికారులు లబ్ధిదారులకు పూర్తి మొత్తాన్ని ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు….. పోస్టల్ కార్యాలయాల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, మహిళలు తమ సొమ్ము కోసం గంటల తరబడి ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ భావిస్తోంది.

కొత్తగా తెరిచే ఈ పోస్టల్ బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే పింఛన్ డబ్బులను లబ్ధిదారులు తమకు వీలైనప్పుడు, అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి గానీ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా గానీ సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవస్థలు తప్పుతాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపును మరింత పారదర్శకంగా మార్చేందుకు 'లైవ్ అథెంటికేషన్' ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులు బతికే ఉన్నారా లేదా అనే విషయంతో పాటు వారి వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూస్తున్నారు.

ఈ జూన్ నెలాఖరు నాటికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం…. రాబోయే ఆగస్టు నెల నుంచి పింఛన్ దారులందరి ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ (DBT) విధానంలో డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇది ఆలస్యమైతే…. సెప్టెంబర్ నెల నుంచైనా అమల్లోకి రావొచ్చు…!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe