Telangana Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు చర్యలు చేపట్టింది. ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా… తొలి విడతగా రూ. 2,000 కోట్ల బకాయి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట…

ఇవాళ విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల మొత్తాన్ని వంద శాతం క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది.
ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని ప్రభుత్వం తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి శరవేగంగా కసరత్తు చేస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూనే ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.