TG Indiramma Family Life Insurance Scheme : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' అధికారికంగా ప్రారంభించనుంది.
రూ. 5 లక్షల ఆర్థిక భరోసా...

ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో ఉపాధి పొందే ఒక ప్రధాన వ్యక్తికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పాలసీదారులు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
"కుల, మత, ఆదాయ భేదాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాం," అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియ... ప్రత్యేక శిబిరాలు
నవంబర్ 19వ తేదీ నుంచే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ-శ్రామ్ (e-Shram) పోర్టల్ ద్వారా అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహిస్తారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతల కోసం ప్రజలు తమ సమీపంలోని ఎంపీడీవో (MPDO), గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.