తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పేరు లేకుంటే ఏం చేయాలి?

Telangana Graduates MLC : తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు ఎన్నికల సంఘం అప్డే్ట్ ఇచ్చింది. ముసాయిదా జాబితా విడుదల చేసింది. మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి.

Published on: Nov 25, 2026, 16:11:29 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

రెండు నియోజకవర్గాల పరిధిలో కలిపి మొత్తం 11,89,191 మంది పట్టభద్రులు ఓటు హక్కుకు అర్హత సాధించినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబరు 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం వచ్చిన దరఖాస్తులు 12,69,191, అర్హులైన ఓటర్లు 11,89,191, తిరస్కరించిన దరఖాస్తులు 80,635, మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఓటర్లు 5,68,105, వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఓటర్లు 6,21,086 ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,10,652, మహిళా ఓటర్లు 4,78,528 కాగా.. మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,703 ఉండనున్నాయి.

రెండు నియోజకవర్గాల పరిధిలో సుమారు 80 వేలకు పైగా దరఖాస్తులు సరైన ధృవపత్రాలు లేకపోవడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురయ్యాయి.

జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి?

ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని అర్హులైన పట్టభద్రులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి, వివరాలు సవరించుకోవడానికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసి, ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పేరు, ఇంటి పేరు, చిరునామా లేదా ఫొటో వంటి వివరాలలో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి ఫారం-8 సమర్పించాలి. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని భావిస్తే, వాటిని తొలగించాలని కోరుతూ ఫారం-7 ద్వారా అభ్యంతరం తెలియజేయవచ్చు. డిసెంబరు 25 లోగా అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. డిసెంబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్‌లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి?

పట్టభద్రులు తమ ఓటు స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధికారిక వెబ్‌సైట్ (ceotelangana.nic.in)లో నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ జిల్లా, నియోజకవర్గం ఎంచుకోవడం ద్వారా మీ పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ, ఈసారి కొత్త జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.