రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా మొత్తం 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా…. చివరి విడత నామినేషన్లు ఇవాళ్టి నుంచి స్వీకరిస్తారు. ఇందుకోసం ఆయా గ్రామ పంచాయతీల్లో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇవాళ్టి నుంచి మొదలయ్యే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆ తరువాత రోజు నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన తర్వాత… ఆ మరుసటి రోజు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు.
ముగిసిన రెండో విడత నామినేషన్లు:
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు, 38,342 వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించారు.
రెండో విడత నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. డిసెంబర్ 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. ఇదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ నిర్వహించి… ఫలితాలను ప్రకటిస్తారు. ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.