TG HC On HYDRAA : 'కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటం మీకు అలవాటుగా మారింది'.. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ ఆస్తిలోకి వెళ్లిన వ్యవహారంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. న్యాయస్థానాల ఆదేశాలను దిక్కరిస్తే ఊరుకునేది లేదని న్యాయమూర్తి హెచ్చరించారు.
Telangana High Court On HYDRAA Commissioner : న్యాయస్థానాలు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారంటూ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని ఒక ప్రైవేట్ ఆస్తిలోకి అధికారులను అనుమతించడం ద్వారా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తన న్యాయవ్యవస్థ అధికారాన్ని, చట్ట పాలనను దెబ్బతీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రంగనాథ్ పై హైకోర్టు సీరియస్…
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు దిక్కార పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేస్తూ…. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంలో హైడ్రా చీఫ్ "హాబిచువల్ అఫెండర్" (అలవాటుపడిన ఉల్లంఘనదారు)గా మారారని అభిప్రాయపడ్డారు. ఒకే రిట్ పిటిషన్ వ్యవహారంలో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు దాఖలవుతున్నాయంటే న్యాయస్థానం ఉత్తర్వులంటే మీకు ఏ మాత్రం గౌరవముందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో పిటిషనర్ కోర్టు దృష్టికి పలు కీలక అంశాలను తీసుకొచ్చారు. లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2 ల పరిధిలోని 40 ఎకరాల స్థలంలో తమ అధీనంలో ఉన్న ఆస్తిలో ఎటువంటి జోక్యం చేసుకోబోమని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ గతంలో కోర్టుకు స్పష్టమైన అండర్‌టేకింగ్ ఇచ్చారు. అయినప్పటికీ, జూలై 18న దాదాపు 200 మంది సిబ్బంది, 50కి పైగా వాహనాలు, బుల్‌డోజర్లు, ఎక్స్‌కవేటర్లతో ఆ స్థలంలోకి ప్రవేశించారని పిటిషనర్ తెలిపారు.
అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్స్, రేకుల షెడ్లు, సీసీటీవీ కెమెరాలు, గేట్లు, విద్యుత్ పరికరాలను కూల్చివేశారని ఆరోపించారు. ఆ భూమి ప్రభుత్వ ఆస్తి అని పేర్కొంటూ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని వివరించారు. ఈ హైడ్రా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో తనను, తన న్యాయవాదిని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారని కూడా పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.
ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోం….
ఈ మొత్తం వ్యవహారంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే న్యాయస్థానాలు దిశానిర్దేశం చేసినప్పటికీ…. ఒక అధికారి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోతే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. ఈ కేసులో అసలు బాధితుడు కేవలం పిటిషనర్ మాత్రమే కాదు… న్యాయస్థానం కూడా అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని…. ఏ వ్యవస్థ అయినా చట్టానికి అతీతం కాదని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు, పోలీసులు రావడంతో కోర్టు ఆవరణలో హడావుడి చోటుచేసుకుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

