...
...
Next Story

ఫిర్యాదు చేసిందని మహిళ దారుణ హత్య - గంటల్లోనే చేధించిన పోలీసులు, కేసులో విస్తుపోయే నిజాలు

సెల్‌ఫోన్ దొంగతనం, రూ.45 వేల నగదు బదిలీ వివాదంతో చేవెళ్లలో ఓ మహిళ హత్యకు గురైంది. రంగంలోకి దిగిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు…. 24 గంటల్లోనే 19 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Published on: Nov 23, 2026, 13:56:59 IST
Advertisement

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. సెల్‌ఫోన్ దొంగతనం, ఆన్‌లైన్ నగదు బదిలీకి సంబంధించిన వివాదంలో మహిళను కత్తితో పొడిచి హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని బత్తుల పద్మగా పోలీసులు గుర్తించారు. చేవెళ్లలోని ఫరా కళాశాల ఎదురుగా ఉన్న ఒక రేకుల షెడ్డు సమీపంలో ఈ దారుణం జరిగింది.

Representative Image (Pixel)
Representative Image (Pixel)

ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌కు చెందిన శివ…. హత్య తర్వాత పరారయ్యాడు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో పాటు, అతని వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

అసలు వివాదం ఏంటి…?

పోలీసుల దర్యాప్తులో ఈ హత్యకు దారితీసిన కారణాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 20, 2026న నిందితుడు శివ…. బత్తుల గురువులు అనే వ్యక్తికి చెందిన సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అనంతరం ఆ ఫోన్ ద్వారా గురువులు బ్యాంకు ఖాతా నుంచి వేరొక ఖాతాకు రూ. 45,000 నగదును అక్రమంగా బదిలీ చేసుకున్నాడు.

తన ఫోన్ చోరీ, నగదు బదిలీ వెనుక శివ హస్తం ఉందని గురువులు అనుమానించారు. దీంతో నవంబర్ 21న ఆయన, బత్తుల పద్మతో కలిసి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శివపై ఫిర్యాదు చేశారు. తనపై అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో శివ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పద్మపై కత్తితో దాడి చేసి…. ఆమెను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీసుల విచారణలో నిందితుడి నేర చరిత్ర కూడా బయటపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు పాత దొంగతనం కేసుల్లోనూ శివ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన 24 గంటల్లోనే నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ వెంకటేష్, ఇతర పోలీసు సిబ్బందిని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ కె. నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks