Telangana Police : పోలీస్ శాఖలో సరికొత్త విధానం - ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్..! స్టేషన్‌కు వెళ్లకుండానే...
తెలంగాణ పోలీస్ శాఖ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో స్టేషన్ కు వెళ్లకుండానే ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందే వెసులుబాటును కల్పించింది. ఈ సరికొత్త విధానాన్ని హైదరాబాద్ లో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు.
నేర బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ మరో అడుగు ముందుకేసింది. బాధితుల/పౌర కేంద్రీకృత విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ నగరంలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జానర్ ప్రకటించారు.

తెలంగాణ సీఐడీ విభాగం రూపొందించిన నూతన 'విక్టిమ్/సిటిజన్ సెంట్రిక్' విధానం ప్రకారం.. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని సీపీ సజ్జనార్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన బాధితులకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఒక ప్రయాసగా మారకూడదనే సదుద్దేశంతో తెలంగాణ పోలీస్ శాఖ ఈ గొప్ప ముందడుగు వేసిందని అన్నారు.
ఈ నూతన విధానం అమలుపై మాట్లాడిన సీపీ సజ్జనార్… ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో బాధితులకు త్వరతగతిన సేవలందించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పారు. బాధితులు ఆసుపత్రిలో ఉన్నా సరే…. పోలీసులు అక్కడికే వెళ్లి వివరాలు సేకరించి తక్షణమే కేసు నమోదు చేస్తారని తెలిపారు.
గతంలో ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉండటం.. అప్పటికే మానసిక ఆందోళనలో ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగించేదని ఆయన గుర్తుచేశారు. ఈ పౌర కేంద్రీకృత విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని… పోలీసులే స్వయంగా వారి వద్దకు వెళ్తారని స్పష్టం చేశారు.
ఈ విధానం అమలులో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధిత పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అకారణంగా ఏ ఒక్క బాధితుడైనా పోలీస్ స్టేషన్ కు తిరగాల్సి వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి కేసును ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.
అందుబాటులోకి వాట్సాప్ నెంబర్…
బాధితుల గౌరవానికి, గోప్యతకు భంగం కలగకుండా ఈ సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. బాధితుల/పౌర కేంద్రీకృత విధానం ప్రకారం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 94906 16555 వివరాలు పంపాలని సూచించారు.
సైబర్ నేర బాధితుల కోసం ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించిన 'సీ-మిత్ర'తో పాటు, ఇప్పుడు ఈ నూతన విధానం కూడా ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని సీపీ తెలిపారు.
ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ నమోదు సౌకర్యం అన్ని జిల్లాల్లోనూ బుధవారం నుంచే అమలు చేస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి అక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో అమల్లోకి తీసుకొచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











