TG SET 2026 Notification : రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన ‘తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష’ (TG-SET 2026) దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, ఆలస్య రుసుము తేదీలు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌తో పాటు పరీక్ష నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది.
టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ -ముఖ్య తేదీలు:
- ఆగస్టు 3, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
- ఆగస్టు 30వ తేదీ వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 1500 ఆలస్య రుసుముతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చారు.
- రూ. 2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తుకు చివరి అవకాశం కల్పించారు.
- సర్పించి వివరాల్లో ఏవైనా తప్పులుంటే దిద్దుకునేందుకు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
- సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/

టీజీ సెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. రెండింటికీ కలిపి మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు.
- ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్ -2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు (రిజర్వ్‌డ్ వర్గాలకు 50 శాతం) సాధించిన వారు ఈ టీజీ సెట్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు. తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాలకు ఈ అర్హత తప్పనిసరి.