ఏపీ - తెలంగాణ : కొత్త జిల్లాలపై కసరత్తు - తెరపైకి 5 విలీన గ్రామాల అంశం..! ప్రయత్నాలు ఫలిస్తాయా..?

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సమయంలో విలీనమైన ఐదు గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై మంత్రి తుమ్మల.. కేంద్రంతో పాటు ఏపీ సర్కార్ కు లేఖలు రాశారు.  

Published on: Nov 7, 2025, 09:55:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే తుది నివేదికను అందజేయనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం విలీన గ్రామాల అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ స్థానికుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు.

భద్రాచలం  (HT PHOTO)
భద్రాచలం (HT PHOTO)

కేంద్రానికి లేఖ…!

భద్రాచలం రామాలయ అభివృద్ధితో పాటు ఐదు విలీన గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉష్ణ గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించారు.

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఈ గ్రామాల విలీనం జరిగింది. భద్రాచలం పట్టణం మాత్రం తెలంగాణలోనే ఉండగా….యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఏపీ భూభాగంలోకి వెళ్లాయి. ఈ ఐదు గ్రామాల ఆవాసాలు భౌగోళికంగా రెండు వైపులా తెలంగాణ భూముల మధ్య ఉన్నాయి. మరోవైపు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండటంతో… పరిపాలన పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇరు ప్రభుత్వాలకు ఇబ్బందికరంగానే ఉందన్న వాదన కూడా చాలా రోజులుగా ఉంది.

గత దశాబ్ద కాలంగా ఇక్కడి ప్రజలు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు.తమ 5 గ్రామాలను తెలంగాణకు పునరుద్ధరించాలని కోరుతున్నారు. చాలాసార్లు ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వాలకు కూడా లేఖలు రాశారు. ఈ విషయాలన్నింటిని మంత్రి తుమ్మల తన లేఖలో వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా కేంద్రీకృత పాలన స్ఫూర్తితో ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల కోరారు.

భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణలో ఉండగా… ఆంధ్రప్రదేశ్ లోని పురుషోత్తపట్నంలో అనేక అనుబంధ దేవాలయాల భూములు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. గిరిజన నివాసితుల విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు జీవనోపాధి వంటి విషయాల్లో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పదే పదే అంతర్రాష్ట్ర తనిఖీలతో పాటు రవాణాలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

భూ పరిమితుల కారణంగా భద్రాచలం ఆలయం డంపింగ్ యార్డులు మరియు సహాయక నిర్మాణాలు వంటి సౌకర్యాల కోసం స్థలాన్ని పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. ఐదు గ్రామాలను తెలంగాణతో విలీనం చేయడం వల్ల ఆలయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ డిమాండ్ రాజకీయ ప్రేరేపితమైనది కాదని…. నిజమైన పరిపాలనా మరియు భావోద్వేగ విజ్ఞప్తి అని మంత్రి తుమ్మల నొక్కి చెప్పారు. "ఒక దశాబ్దానికి పైగా, స్థానిక గ్రామసభలు, గిరిజన సంఘాలు మరియు ప్రభుత్వ సంస్థలు ఈ విలీనం కోసం పదేపదే కోరుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 లోని నిబంధనల ప్రకారం ఈ ఐదు గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్ నుండి మినహాయించాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. వాటిని తెలంగాణకు పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలన్నారు. భద్రాచలం ప్రాంత ప్రజల దీర్ఘకాల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు త్వరలోనే ఏపీ కొత్త జిల్లాలపై సీసీఎల్ఎ నివేదిక రూపొందిస్తుందని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. సీఎం వద్ద చర్చించి తుది నిర్ణయాలు వెల్లడిస్తామని పేర్కొంది. కొత్తగా ఎనిమిది జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుండి వినతులు వచ్చాయని వివరించింది. కానీ పరిపాలనా పరంగా సౌలభ్యంగా ఉండే వాటిపైనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై కూడా చాలా ప్రతిపాదనలు వచ్చాయని…. వీటిపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం మేరకు కొత్త డివిజన్ల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటుందా…? తెలంగాణ సర్కార్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రక్రియ జరగాలంటే…. పునర్విభజన చట్టానికి సవరణ జరగాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తూ… కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే విలీన గ్రామాలపై అడుగు ముందుకు పడొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More