Call Centre Scam : ఢిల్లీ కేంద్రంగా ఫేక్ కాల్‌ సెంటర్లు - 21 మంది తెలుగు మహిళా టెలికాలర్లు అరెస్ట్!

ఢిల్లీ నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలకు రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌నుTGCSB చేధించింది. 21 మంది తెలుగు మహిళా టెలికాలర్లు, ఒక బ్యాంక్ ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు.

Published on: Aug 11, 2026, 07:30:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీ వేదికగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఛేదించారు. నకిలీ కాల్ సెంటర్లను నడుపుతూ, తెలంగాణకు చెందిన అమాయక ప్రజలను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

నకిలీ కాల్‌ సెంటర్లు (HT File) (HT_PRINT)
నకిలీ కాల్‌ సెంటర్లు (HT File) (HT_PRINT)

ఈ విచారణలో భాగంగా ఢిల్లీలోని మూడు వేర్వేరు కాల్ సెంటర్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు…. 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు మోసాలకు సహకరించిన ఒక బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ముగ్గురు కీలక సూత్రధారులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఢిల్లీ కేంద్రంగానే ….

ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా ఈ సైబర్ దందా సాగుతోంది. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి ఈ మూడు నకిలీ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం పోలీసుల కంటికి చిక్కకుండా పరారీలో ఉన్నారు. గత దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ కాల్ సెంటర్ల నెట్‌వర్క్ గుట్టుచప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది.

తెలంగాణ ప్రజలను నమ్మించి, మోసం చేయడానికి ఈ ముఠా అత్యంత పక్కా పథకాన్ని రచించింది. దీని కోసం 25 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి… తెలుగు ధారాళంగా మాట్లాడగలిగే మహిళలను టెలికాలర్లుగా నియమించుకున్నారు. ప్రధానంగా జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ ప్రాంతాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళలను ఢిల్లీకి తీసుకెళ్లి ఈ ఉద్యోగాల్లో చేర్పించారు.

ఈ మహిళలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ఫోన్లు చేసేవారు. తక్కువ వడ్డీకే ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ బాధితులతో మాట్లాడి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకునేవారు.

ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ఆధారంగా టెలికాలర్లు బాధితులతో మాట్లాడేవారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో దఫదఫాలుగా డబ్బులు తమ ఖాతాల్లోకి జమ చేయించుకునేవారు. బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత…. వారితో మాట్లాడటం పూర్తిగా నిలిపివేసేవారు. కొన్ని సందర్భాల్లో రుణం త్వరలోనే మంజూరవుతుందంటూ మరిన్ని డబ్బులు గుంజేవారు.

నిలదీస్తే బెదిరింపులు…

ఒకవేళ బాధితులు అనుమానం వచ్చి జమ చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని నిలదీస్తే, ఈ కేటుగాళ్లు బెదిరింపులకు దిగేవారు. లీగల్ నోటీసులు పంపుతామని, వ్యక్తిగత సమాచారాన్ని, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని… సమాజంలో పరువు తీస్తామని భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ భయంతో బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా వెనకడుగు వేసేలా ప్లాన్ చేసేవారు.

ఈ మెరు దాడుల్లో అధికారులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక విచారణలో తెలంగాణవ్యాప్తంగా నమోదు చేసిన 22 సైబర్ నేరాల కేసులతో ఈ నెట్‌వర్క్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

రుణాల పేరుతో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల పౌరులు తీవ్ర జాగ్రత్త వహించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, వెరిఫికేషన్ ఛార్జీలు చెల్లించే ముందు సదరు కాల్ చేసిన వ్యక్తి, సంస్థ యొక్క ప్రామాణికతను స్వతంత్రంగా సరిచూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More