TGSRTC : హైదరాబాద్‌లో రాబోయే 10 ఏళ్లలో 7,800 బస్సులు ప్లాన్ చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ

TGSRTC : హైదరాబాద్‌లో రాబోయే పదేళ్లలో భారీగా బస్సులను పెంచాలని టీజీఎస్ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. రెండు దశాబ్దాలుగా చూసుకుంటే బస్సుల సంఖ్య భాగ్యనగరంలో తగ్గింది.

Published on: Nov 28, 2026, 19:14:51 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సంఖ్యను రాబోయే 10 ఏళ్లలో 7,800కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2000వ సంవత్సరంలో సుమారు 3,800 బస్సులు ఉండగా నగర జనాభా, ప్రయాణ అవసరాలు పెరిగినా ప్రస్తుతం ఈ సంఖ్య 3,212కి తగ్గింది.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

ప్రజా రవాణాకు సంబంధించిన ఓ చర్చా వేదికలో టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచురి శ్రీధర్ ఈ ప్రణాళికను వెల్లడించారు. 10 ఏళ్ల సుదీర్ఘ లక్ష్యం దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అయితే తక్షణమే సైబరాబాద్ ప్రాంతంలో 450 బస్సులను, 60 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోందని శ్రీధర్ చెప్పుకొచ్చారు.

గణాంకాల ప్రకారం.. 2000వ సంవత్సరంలో సుమారు కోటిగా ఉన్న హైదరాబాద్ జనాభా ప్రస్తుతం సుమారు 1.2 కోట్లకుపైగా పెరిగింది. అదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం తగ్గింది. బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అంగీకరించిన శ్రీధర్.. ఫైనాన్షియల్ వయాబిలిటీ ఒక ప్రధాన అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. బస్సు కార్యకలాపాల లాభదాయకతను లెక్కించేటప్పుడు, ప్రజా రవాణా వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను తగినంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌లో 3,212 బస్సులను నడుపుతోంది. ఇందులో 2,681 డీజిల్ బస్సులు, 531 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా ప్రతిరోజూ 23.58 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, సుమారు మూడు లక్షల మంది పాస్ హోల్డర్లు ఉన్నారు. సంస్థ రోజుకు 3,477 ట్రిప్పులను నిర్వహిస్తూ ప్రతిరోజూ 8.43 లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోంది.

ఐటీ కారిడార్‌లో 390 బస్సులు రోజుకు 3,793 ట్రిప్పులను నడుపుతున్నాయి. ఇవి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రాంతాలకు సేవలను అందిస్తున్నాయి. మరోవైపు మెట్రో, రైల్వే స్టేషన్లను కనెక్ట్ చేస్తూ.. సేవలను అందించడంతో పాటుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్సుల లైవ్ ట్రాకింగ్ సదుపాయాన్ని, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

సైబరాబాద్‌లో 450 బస్సులు, 60 మినీ-బస్సులను అదనంగా చేర్చాలనే ప్రతిపాదనను సైబరాబాద్ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ప్రణాళిక చేస్తున్నామని శ్రీధర్ చెప్పారు. జేఎన్‌టీయూ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ మధ్య ప్రత్యేక కాంట్రా-ఫ్లో బస్ కారిడార్‌పై కూడా కార్పొరేషన్ పనిచేస్తోంది. దీనివల్ల రద్దీ సమయాల్లో బస్సులు సాధారణ ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో ప్రత్యేక లేన్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.