టికెట్ చిల్లర గొడవ - బస్సులోంచి తోసేయడంతో గాయపడిన ఆర్టీసీ కండక్టర్ మృతి! అసలేం జరిగిందంటే..?
చిల్లర వివాదంలో ప్రయాణికురాలు కదిలే బస్సులోంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడ్డ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 10 రోజులుగా ప్రాణాలతో పోరాడిన ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు.
మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. టికెట్ చార్జీ, చిల్లర విషయంలో ఒక మహిళా ప్రయాణికురాలితో జరిగిన ఘర్షణలో కదిలే బస్సులోంచి కిందకు తోసేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రవళిక చివరికి ప్రాణాలు విడిచారు.

అసలేం జరిగింది….?
అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో మౌనిక అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎక్కింది. బాబు టికెట్ చార్జీ, మిగిలిన చిల్లర విషయంలో కండక్టర్ ప్రవళికతో ఆమెకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ప్రయాణికురాలు రూ. 100 నోటు ఇవ్వగా…. కండక్టర్ ప్రవళిక టికెట్ జారీ చేసి, తన వద్ద ప్రస్తుతం చిల్లర లేనందున కాసేపటి తర్వాత తీసుకోవాలని చెప్పారు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్దకు వచ్చేసరికి మరింత తీవ్రమైంది. అప్పటికే రద్దీగా ఉన్న బస్సు ప్రయాణిస్తుండగానే, ఆగ్రహంతో ఊగిపోయిన సదరు ప్రయాణికురాలు ప్రవళికను బయటకు తోసేసినట్లు తెలిసింది. రోడ్డుపై పడిపోయిన ప్రవళిక కుడి కాలుపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎడమ కాలుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే ప్రవళికను మొదట భద్రాచలంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత 10 రోజులుగా అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఆమె పరిస్థితి మంగళవారం రాత్రి తీవ్రంగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితురాలు మౌనికను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది - సీఎం రేవంత్
మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని… అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీనిచ్చారు.
బాధ్యులపై కఠిన చర్యలు - మంత్రి పొన్నం
కండక్టర్ ప్రవళిక మృతి పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రవళికకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. ఆమె కోలుకుంటుందని ఆశించాం. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అండగా ఉంటాయి," అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

