సింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు.. కేటీఆర్ చెప్పినవి అబద్ధాలు : మంత్రి శ్రీధర్ బాబు

సింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ సింగరేణిని ఏటీఎంలా వాడుకుందని ఆరోపణలు చేశారు.

Published on: Oct 15, 2026, 16:10:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు

పదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకురావడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.

నిజానికి సింగరేణిలోని ‘తాడిచర్ల కోల్ బ్లాక్’ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనని శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా కొండగా మార్చారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ప్రతి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులన్నీ తమ అనుచరులకే కట్టబెట్టారని, కానీ ఇప్పుడు ప్రతిదీ నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు.

సింగరేణిలో బొగ్గు మాయమైందనడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ఆరోపణ మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపారేశారు. బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా, సరఫరా వరకు అధునాతన సాంకేతికతతో పర్యవేక్షణ ఉందన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఏటా 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే, దాని ఉత్పత్తిపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త బొగ్గు గనుల ఆవిష్కరణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గును వేగంగా తరలించి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు.

గతంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల సంక్షేమానికి కట్టుబడి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దసరా బోనస్ అందిస్తుందని మంత్రి చెప్పారు. సింగరేణి ప్రతిష్ఠను దిగజార్చేలా కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More